Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
2019 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రజా సంకల్పం పేరిట వైసీపీ అధినేత మొదలెట్టిన పాదయాత్ర మీద జోరుగా చర్చ సాగుతోంది. ఈ యాత్ర వైసీపీ కి అదృష్టం తెచ్చిపెడుతుందని ఆ పార్టీ ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఆ పాదయాత్ర మొదలైందో లేదో తెలంగాణాలో ఇంకో నాయకుడు అదే బాటన నడవబోతున్నాడు. ఆయన ఇంకెవరో కాదు ఇటీవలే టీడీపీ కి గుడ్ బై కొట్టి కాంగ్రెస్ లో చేరిన రేవంత్ రెడ్డి.
మహాసముద్రం లాంటి కాంగ్రెస్ పార్టీలోకి ఓ నీటిబిందువులా చేరిన రేవంత్ కి ఆ స్థాయిలో అక్కడే ఆగిపోవాలి అనుకోవడం లేదు. కాంగ్రెస్ లో కూడా తనని తాను నిరూపించుకోవాలి అనుకుంటున్నాడు. అందుకే కాంగ్రెస్ నేతలు అందరినీ కలుస్తున్నాడు రేవంత్. తనని మీలో ఒకడిగా భావించమని కోరుతూ వారి మద్దతు కూడగట్టుకుంటున్నాడు. పనిలో పనిగా తెరాస సర్కార్ ని దీటుగా ఎదుర్కోడానికి, కెసిఆర్ ని ఢీకొట్టడానికి తాను పాదయాత్ర చేయాలని నిర్ణయించుకున్నట్టు కూడా వారికి చెబుతున్నారు.
త్వరలో తెలంగాణ కి వస్తున్న కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి కూడా తన పాదయాత్ర లక్ష్యం, షెడ్యూల్ వివరించి ఆయన సూచనలకు అనుగుణంగా రేవంత్ ఓ ప్రకటన చేసే ఛాన్స్ వుంది. అయితే రేవంత్ ఆలోచనని కాంగ్రెస్ లోనే ఓ వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. రేవంత్ ఒక్కడు కాకుండా కొందరు నేతలు సామూహికంగా పాదయాత్ర చేస్తే బాగుంటుందన్న ఆలోచన ముందుకు తెచ్చారు. తెలంగాణాలో ఇంతకుముందు తెలుగు దేశం నేతలు గతంలో ఈ తరహాలో పాదయాత్ర చేసిన వైనాన్ని గుర్తు చేస్తున్నారు. మొత్తానికి జగన్ బాటలో టీ కాంగ్రెస్ నేతలు పాదయత్రకి రెడీ అవుతున్నారన్న వార్త కెసిఆర్ కి కాక పుట్టిస్తోంది.