‘ఓ బేబీ’ మూవీ రివ్యూ

review of oh baby

కథల ఎంపికలో వైవిధ్యానికి, కొత్తదనానికి పెద్దపీట వేస్తున్నది సమంత. ప్రయోగాత్మక ఇతివృత్తాల్ని ఎంచుకుంటూ నటిగా తనలోని భిన్న పార్శాల్ని ఆవిష్కరించుకోవాలని తపిస్తున్నది. యూ టర్న్ సూపర్‌డీలక్స్ వంటి సినిమాలు ఆమె అభిరుచికి అద్దం పట్టాయి. తాజాగా సమంత మరో వినూత్న కథా చిత్రాన్ని ఎంచుకుంది. కొరియన్ చిత్రం మిస్‌గ్రానీ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకాదరణ సొంతం చేసుకుంది. దాదాపు ఏడు భాషల్లో పునర్నిర్మాణం జరుపుకొని విజయం సాధించింది. ఈ సినిమా ఆధారంగా ఓ బేబీ చిత్రాన్ని రూపొందించారు. నిర్మాణం నుంచే ఆసక్తిని రేకెత్తించిన ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏ మేరకు ఆకట్టుకుంది? ఈ సినిమా విషయంలో సమంత అంచనాలు ఎంతవరకు నిజమయ్యాయి? ఈ అంశాలన్ని తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే..

కథా సంగ్రహణం..
సావిత్రి అలియాస్ బేబీ (లక్ష్మి) 70 ఏళ్ల వృద్ధురాలు. కొడుకు శేఖర్ (రావు రమేష్) అంటే పంచప్రాణాలు. వెటకారం, వ్యంగ్యంతో అందరిని నవ్వించే బేబీకి కాస్త చాదస్తం కూడా ఎక్కువే. బేబీ చూపించే ఆప్యాయతను ఆమె కోడలు (ప్రగతి) అపార్థం చేసుకుంటుంది. ఓ సందర్భంలో కోడలు అస్వస్థతకు గురవుతుంది. అందుకు కారణం బేబీనే అని మనమరాలు నిందించడంతో బేబీ ఇళ్లు వదిలి వెళుతుంది. దేవుడు తనకు ఘోరంగా అన్యాయం చేశాడని, యవ్వనంలో తాను కోరుకున్న ప్రేమను.. జీవితాన్ని ఇవ్వలేదని ఎప్పుడు బాధపడే బేబీకి బయట అనూహ్య ఘటనలు తారసపడతాయి. ఓ స్వామీజీ ఆమెను కలిసి వినాయకుడి ప్రతిమను బహూకరిస్తాడు. దానిని స్వీకరించిన బేబీ 24 ఏళ్ల యవ్వని స్వాతిగా మారిపోతుంది. పడుచు పిల్లగా మారిన బేబీకి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? దేవుడు ప్రసాదించిన కొత్త జీవితం ద్వారా బేబీ ఏం తెలుసుకుంది? తిరిగి తన కుటుంబానికి ఎలా దగ్గరైంది? అన్నదే మిగతా చిత్ర కథ.

విశ్లేషణ..
గతంలోకి వెళ్లిపోయి తీరని కోరికల్ని నెరవేర్చుకోవాలన్నది అందమైన ఫాంటసీ. దేవుడు మరో అవకాశం ఇస్తే తిరిగి వెనక్కి వెళ్లిపోయి తాము కోరుకుంటున్నట్లుగా జీవితాన్ని గడపాలని ప్రతి ఒక్కరూ ఏదో సందర్భంలో అనుకుంటారు. ఈ ఫాంటసీ అంశాన్ని 70ఏళ్ల వృద్ధురాలు దృష్టికోణం నుంచి ఈ సినిమాలో ఆవిష్కరించారు. ప్రథమార్థంలో చక్కటి వినోదం పండింది. యవ్వనవతిగా మారిన బేబీ తన కటుంబంలోకి ప్రవేశించి పండించే హాస్యంతో ఫస్ట్‌హాఫ్ సరదాగా సాగిపోయింది. ద్వితీయార్థాన్ని ఎమోషన్ ప్రధానంగా నడిపించారు. ఈ ఫాంటసీ కథను తల్లికొడుకు బంధం చుట్టూ అల్లుకోవడంతో చక్కటి సెంటిమెంట్ పండింది. మనవడిని ఎంతగానో ప్రేమించే బేబీ అతడి లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎలా సహకరించిందనే అంశాన్ని ైక్లెమాక్స్ ఘట్టాల్లో భావోద్వేగభరితంగా చూపించారు.

సెకండాఫ్‌లో కథా గమనం కాస్త మందగించింది. కొన్ని సన్నివేశాల్ని సాగదీశారనే భావన కలుగుతుంది. తీరని కలల్ని నెరవేర్చుకునే అవకాశం వచ్చినప్పటికి బేబీ తన కొత్త జీవితంలో ఎదుర్కొన్న సంఘర్షణను తాత్వికంగా ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. వినోదంతో పాటు అదే మోతాదులో ఉద్వేగాలు పండాయి. అమ్మానాన్నలు ఉన్నంత వరకే మనం చిన్నపిల్లలం. వాళ్లు ఈ లోకాన్ని విడిచివెళ్లిపోతూ మన బాల్యాన్ని కూడా తీసుకెళ్లిపోతారు.. వంటి సంభాషణలు హృద్యంగా అనిపిస్తాయి. కొరియన్ కథలో తెలుగు నేటివిటీకి అనుగుణంగా చాలా మార్పులు చేశారు. తల్లికొడుకు సెంటిమెంట్‌కు పెద్దపీట వేశారు. అయితే సినిమాలోని కొన్ని సన్నివేశాల్లో లాజిక్ మిస్ అయిన భావన కలుగుతుంది.

నటీనటుల పనితీరు…
ఈ పాత్రలో తనని తప్ప మరొకరిని ఊహించుకోలేనంత గొప్పగా సమంత అద్భుతాభినయాన్ని ప్రదర్శించింది. అల్లరి, అమాయకత్వం, గడసరితనం కలబోతగా ఆమె నటన అందరిని మెప్పిస్తుంది. వినోదంతో గిలిగింతలు పెడుతూ సెంటిమెంట్ సన్నివేశాల్లో కంటతడి పెట్టిస్తూ సినిమాకు ఆయుపట్టులా నిలిచింది సమంత. ఆమె కెరీర్‌లోనే బెస్ట్ పర్‌ఫార్మెన్స్‌గా అభివర్ణించవొచ్చు. ఇక వృద్ధురాలైన బేబీ పాత్రలో లక్ష్మి పరకాయప్రవేశం చేసింది. రావు రమేష్, రాజేంద్రప్రసాద్ తమ పాత్రలకు పరిపూర్ణంగా న్యాయం చేశారు. ప్రథమార్థంలో సమంత, రాజేంద్రప్రసాద్ మధ్య వచ్చే సన్నివేశాల్లో చక్కటి వినోదం పండింది. పతాకఘట్టాల్లో సమంత, రావురమేష్ మధ్య సీన్స్ హార్ట్‌టచింగ్‌గా సాగాయి.

నాగశౌర్య పాత్ర చిన్నదే అయినా తన పరిధిలో మెప్పించాడు. బాల నటుడు తేజ ఈ సినిమాలో ముఖ్య పాత్రను పోషించాడు. ఔత్సాహిక సంగీతకారుడు రాఖీగా అతని నటన ఆకట్టుకుంది. జగపతిబాబు, అడవిశేష్, నాగచైతన్య అతిథి పాత్రల్లో కనిపించారు. లక్ష్మీభూపాల్ సంభాషణలు హృదయానికి హత్తుకునేలా ఉన్నాయి. మిక్కీ జే మేయర్ స్వరపరచిన పాటలు ఫర్వాలేదనిపించాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫీ బాగుంది. కథకు తగినట్లుగా నిర్మాణ విలువలు ఉన్నాయి. కొరియన్ మాతృకను తెలుగు నేటివిటీనికి అనుగుణంగా అడాప్ట్ చేసుకోవడంలో దర్శకురాలు నందినిరెడ్డి సఫలీకృతురాలైంది. ముఖ్యంగా తల్లికొడుకు సెంటిమెంట్ ప్రధానంగా కథను నడిపించిన విధానం ఆకట్టుకుంది.

తీర్పు..
చక్కటి వినోదం, ఎమోషన్స్ , మదర్‌సెంటిమెంట్ అంశాల కలబోతగా ఓ బేబీ చిత్రాన్ని అర్థవంతంగా తీర్చిదిద్దారు. బాక్సాఫీస్ బరిలో ఈ సినిమా ఎంతమేరకు సక్సెస్ అవుతుందో తెలుసుకోవాలంటే కొద్దిరోజులు వేచిచూడాల్సిందే.