రైల్వేస్‌లో పొడవైన సొరంగమార్గం!

longest tunnel in railway

ఏపీలోని నెల్లూరు -వెలిగొండ కొండల కింద నిర్మించిన ఈ సొరంగమార్గం బుధవారం పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చింది. చెర్లోపల్లి-రాపూర్ స్టేషన్ల మధ్య 6.6 కిలోమీటర్ల పొడవుగల సొరంగమార్గంలో రైళ్ల రాకపోకలు ప్రారంభమయ్యాయి. విద్యుదీకరించిన సొరంగమార్గాల్లో ఇదే అతిపొడవైనది. ఈ సొరంగమార్గం ద్వారా గూడ్స్ రైళ్ల రాకపోకలు విజయవంతంగా సాగుతున్నాయి. ఓబులవారిపల్లి -వెంకటాచలం మధ్య కొత్తగా నిర్మించిన రైల్వేలైనులో ఈ సొరంగమార్గం ఓ భాగం. ఇది కృష్ణపట్నంపోర్టుతో తీరప్రాంతాలను అనుసంధానంచేస్తూ గూడ్స్ రైళ్ల రాకపోకలకు వీలు కలిగిస్తున్నది.

గూడ్స్ రైళ్లను నడుపడానికి ఉద్దేశించిన ఈ మార్గంలో సొరంగమార్గాన్ని 43నెలల రికార్డుకాలంలో పూర్తిచేశారు. ఈ మార్గం వల్ల కృష్ణపట్నంపోర్టు, తీరప్రాంతాల మధ్య దూరం 60 కిలోమీటర్లు తగ్గుతుంది. ఈ రైలుమార్గం వల్ల విజయవాడ-గూడూరు ప్రధాన రైలుమార్గంపై రద్దీ తగ్గుతుందని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్‌మాల్య పేర్కొన్నారు.

న్యూ ఆస్ట్రేలియన్ టన్నెలింగ్ మెథడ్ (ఎన్‌ఏటీఎం) ఉపయోగించి నిర్మించారు. నిర్మాణానికి అయిన ఖర్చు రూ.460 కోట్లు. సొరంగం పూర్తి పొడవు 6,660 మీటర్లు. ఎత్తు (పైకప్పు వరకు) 6.5 మీటర్లు, కాంటాక్టు వైరు కనీస ఎత్తు 5.2 మీటర్లు. ప్రతి 10 మీటర్లకు ఒక ఎల్‌ఈడీ లైటుతోపాటు సొరంగమార్గంలో పనిచేసే సిబ్బంది రక్షణ కోసం ప్రత్యేక ఏర్పాట్లుచేశారు.