గూడూరు-మనుబోలు మధ్య రైల్వే ఫ్లైఓవర్‌..SCR పరిధిలో అత్యంత పొడవైనది..!

Railway flyover between Guduru-Manubolu..longest in SCR range
Railway flyover between Guduru-Manubolu..longest in SCR range

గూడూరు మనుబోలు స్టేషన్ల మధ్య రైల్వే ఫ్లైఓవర్ అందుబాటులోకి వచ్చింది. దక్షిణ మధ్య రైల్వే జోన్‌ పరిధిలో గూడూరు-మనుబోలు రైల్వేస్టేషన్ల మధ్య 2.2 కిలోమీటర్ల మేర నిర్మించిన అతి పొడవైన రైల్వేబ్రిడ్జి ప్రారంభమైంది.విజయవాడ-రేణిగుంట మధ్య రైళ్లు సాఫీగా సాగిపోవడానికి ఈ వంతెన అందుబాటులోకి రానుంది. వంతెన నిర్మించినందుకు రైల్‌ వికాస్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (ఆర్‌వీఎన్‌ఎల్‌) అధికారులను ఎస్‌సీఆర్‌ జనరల్‌ మేనేజర్‌ అరుణ్‌కుమార్‌ జైన్‌ అభినందించారు.

దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని ఉమ్మడి నెల్లూరు జిల్లాలో అత్యంత పొడవైన రైల్‌ ఓవర్‌ రైల్‌ (ఆర్‌ఓఆర్‌) ఫ్లై ఓవర్ అందుబాటులోకి వచ్చింది. విజయవాడ రైల్వే డివిజన్‌ పరిధిలోని గూడూరు-మనుబోలు స్టేషన్ల మధ్య మూడో లైన్‌ పనుల్లో భాగంగా 2.2 కి.మీ. మేర ఈ రైల్‌ ఫ్లైఓవర్‌ను నిర్మించారు. కొత్త వంతెన ఇప్పటి వరకు 40 మీటర్ల ఆర్‌ఓఆర్‌ పొడవైనది రికార్డుల్లో ఉండగా దాన్ని అధిగమించింది. గూడూరు స్టేషన్‌ దక్షిణ మధ్య రైల్వే, దక్షిణ రైల్వేల మధ్య వివిధ రైళ్ల రాకపోకలకుఇంటర్‌ ఛేంజ్‌ పాయింట్‌గా ఉంది. రైల్వే అధికారులు గూడూరు-మనుబోలు మధ్య నిర్మించిన రైల్‌ ఓవర్‌ రైల్‌ జోన్‌లోనే అతి పొడవైనదిగా గుర్తింపు పొందినట్టు తెలిపారు.

రెండేళ్లలోనే ఆర్‌వోఆర్‌ పనులు పూర్తిచేశారు. దక్షిణ మధ్య రైల్వే రూ.3,240 కోట్లు మంజూరు చేసిందని, ఇందులో భాగంగా విజయవాడ- గూడూరు మధ్య మూడో లైను పనుల కోసం ఈ బ్రిడ్జిని నిర్మించినట్లు అధికారులు తెలిపారు. 32.5 టన్నుల యాక్సిల్‌ లోడుతో, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రైళ్లు సజావుగా నడిపేలా వంతెన నిర్మాణం చేపట్టారు. గూడూరు రైల్వే జంక్షన్‌ పరిధిలో అత్యధికంగా రైళ్ల రాకపోకలు సాగుతున్నాయి. ఈ ఫ్లై ఓవర్‌ అందుబాటులోకి రావడంతో ఎంతగానో ఉపయోగపడుతుంది అంటున్నారు.

అంతేకాదు ఈ ఫ్లై ఓవర్ అందుబాటులోకి రావడంతో చెన్నై- విజయవాడ, విజయవాడ- రేణిగుంట మధ్య ఎలాంటి అంతరాయం లేకుండా రైళ్ల రాకపోకలు సాగుతాయని భావిస్తున్నారు.రైల్వే అధికారులు ఈ మార్గంలో రైళ్ల సగటు వేగం మెరుగవుతుందంటున్నారు . సుమారు 10 వరకూ కాలువలు, ఏర్లు మనుబోలు–గూడూరు మధ్య ఉన్నాయి. వీటిలో పంబలేరు గూడూరు సమీపంలోనే పెద్దది.. దీంతో పాటు 2.2 కిలోమీటర్ల దూరంతో సమీపంలోని కొన్ని కాలువలను కలుపుకుని అతి పొడవైన రైల్వే ఫ్లైఓవర్‌ ను నిర్మించారు.