జననాల రేటు చైనాలో గణనీయంగా తగ్గుతుండటంతో అక్కడి సర్కార్ దిద్దుబాటు చర్యలు షురూ చేసింది. ఇందులో భాగంగా అమ్మాయిలకు ఓ బంపర్ ఆఫర్ ఇచ్చింది. యువతులకు 25 లేదా అంతకంటే తక్కువ వయసులో వివాహం చేసుకునే వారికి రివార్డు అందించాలని నిర్ణయించింది. జెజియాంగ్ రాష్ట్రంలోని చాంగ్షాన్ కౌంటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
యువతులు వివాహం చేసుకునేందుకు తగిన వయసులో పిల్లలను కనేలా ప్రోత్సహించే చర్యల్లో భాగంగా చాంగ్షాన్ నగదు ప్రోత్సాహకాన్ని తీసుకువచ్చింది. వివాహం చేసుకునే యువతులకు 25 లేదా అంతకంటే తక్కువ వయసులో ఉండి, మొదటి వివాహం అయితే నగదు పథకం కింద వెయ్యి యువాన్లు ఇస్తుంది. ఆ తర్వాత కూడా పిల్లల విద్య , సంరక్షణ విషయంలోనూ సబ్సీడీలు ఇచ్చి జంటలకు ఆర్థికంగా సహకరించనుంది. చైనా ప్రస్తుతం 140 కోట్లకు పైగా జనాభా కలిగి ఉన్న..తగ్గిపోతున్న జననాల రేటుతో కలవర పడుతోంది. స్త్రీ, పురుషుల కనీస వివాహ వయసు 20, 22 ఏళ్లుగా చైనాలో ఉంది.