Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘గాడ్ సెక్స్ అండ్ ట్రూత్’ ఆయన్ను చిక్కుల్లో పడేసింది. ఇలాంటి సినిమాలకు ఇండియాలో అనుమతి లేదు. అందుకే తాను యూరప్‌లో ఈ చిత్రాన్ని తెరకెక్కించాను అని, సినిమాకు తాను కాన్సెప్ట్ ఇచ్చాను అని, నిర్మాణ సంస్థ ఇండియాకు చెందినది కాదు అంటూ వర్మ తాజాగా చెప్పుకొచ్చాడు. జీఎస్టీ పబ్లిసిటీలో భాగంగా వర్మ ఒక మహిళపై అనుచిత వ్యాఖ్యలు చేయడం, ఆ వ్యాఖ్యలు కాస్త సీరియస్ అయ్యి సీసీఎస్ విచారణ వరకు వచ్చింది. విచారణలో భాగంగా సినిమాకు సంబంధించిన అసలు విషయాలు బయటకు వస్తున్నాయి.
జీఎస్టీ చిత్రాన్ని వర్మ యూరప్‌లో చిత్రీకరించాను అంటూ చెబుతున్న విషయం అవాస్తవం అని, ఆ చిత్రాన్ని ఇండియాలోనే వర్మ చిత్రీకరించాడు అంటూ ఒక జాతీయ దిన పత్రిక కథనం ప్రచురితం చేసింది. మియా మాల్కోవ ఇండియాకు వచ్చిన సమయంలో వారం రోజుల పాటు చిత్రీకరణ చేశాడని, ఆ సినిమాకు సంబంధించిన ఎడిటింగ్ పూర్తిగా ఇండియాలోనే జరిగిందని, ఇక ఆన్‌లైన్‌లో కూడా ఇండియా నుండే అప్‌లోడ్ అయ్యింది అంటూ ఆ పత్రిక కథనం రాసింది.
ఒకవేళ వర్మ ఇండియాలోనే జీఎస్టీ చిత్రీకరించినట్లుగా నిరూపితం అయితే చట్ట ప్రకారం ఆయనకు మూడు నుండి అయిదు సంవత్సరాల జైలు శిక్ష తప్పదని, ఆయన ఇప్పుడు కాకున్నా కాస్త ఆలస్యంగా అయినా ఆ శిక్షను అనుభవించాల్సి ఉంటుందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం నాగార్జునతో సినిమాను తెరకెక్కిస్తున్న వర్మ ఆ తర్వాత పలు చిత్రాలకు కమిట్ అయ్యాడు. వర్మ జైలుకు వెళ్తే ఆ సినిమా పరిస్థితి ఏంటో అని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.