చెన్న కేశవులు చనిపోయే సమయానికి ఆరు నెలల గర్భవతిగా ఉన్న అతడి భార్య రేణుక శనివారం ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. తల్లీ బిడ్డ క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.ఐతే తల్లీ బిడ్డల్ని చూసి సంతోషించే వాళ్ల కంటే బాధపడే వాళ్లే ఎక్కువ మంది. బిడ్డ పుట్టడం సంతోషకర వార్తే అయినా.. ఆ సమయానికి తండ్రి మరణించి ఉండటం, అతడి తాలూకు మరకలు రేప్పొద్దున బిడ్డ మీద పడేందుకు ఆస్కారం ఉండటంతో అయ్యో అనుకుంటన్నారు. చెన్నకేశవులు మరణం తర్వాత రేణుకకు ప్రభుత్వం పని కల్పించిన సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే.. దిశ ఎన్కౌంటర్ మీద సినిమా అంటూ హడావుడి చేస్తున్న వర్మ.. రేణుక ప్రసవం గురించి పోస్ట్ పెట్టడం గమనార్హం. రేణుక, బిడ్డ కలిసి ఉన్న ఫొటోను షేర్ చేసిన వర్మ.. చెన్నకేశవులు తాలూకు ‘రేప్’ మరకలు భవిష్యత్తులో బిడ్డ మీద పడతాయంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. అంతే కాక రేణుక కుటుంబాన్ని ఆదుకోవడం కోసం నెటిజన్లు ఆర్థిక సాయం చేయాలంటూ అకౌంట్ నంబర్ షేర్ చేస్తూ వర్మ అప్పీల్ ఇవ్వడం విశేషం.
వర్మ తన సినిమా పబ్లిసిటీ కోసం ఇలా చేస్తున్నప్పటికీ.. ఇలా బాధితురాలిని ఆదుకోమంటూ అప్పీల్ ఇవ్వడం ఆశ్చర్యం కలిగించే విషయమే. అయినా తన సినిమా కోసం రేణుకను పలుమార్లు కలిసి ఆమె నుంచి సమాచారం రాబడుతున్న వర్మ.. ఆ సాయమేదో తనే చేయొచ్చు కదా అన్న మౌళికమైన ప్రశ్న అందరిలోనూ రావడం సహజం. మరి వర్మ ఆ రకమైన సాయమేదైనా చేస్తున్నాడో లేదో ఆయనకే తెలియాలి.