Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
వివాదాస్పద దర్శకుడు రాం గోపాల్ వర్మ ట్వీట్లు ఎంత హాట్ టాపిక్ అవుతాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన ట్వీట్లను ఆధారంగా చేసుకుని న్యూస్ చానళ్లు అరగంట పాటు స్పెషల్ ఎపిసోడ్లు కూడా రన్ చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఎవరిని పొగడడానికైనా, విమర్శించడానికైనా… తన సినిమా ప్రమోషన్ కైనా… వర్మ గతంలో ట్విట్టర్ నే ఉపయోగించేవారు. ఆయన ట్వీట్లు ఏదో ఓ రూపంలో రోజూ వార్తల్లో నిలిచేవి. అలాంటిది గత ఏడాది సడన్ గా ఆయన ముందుగా చెప్పి మరీ ట్విట్టర్ నుంచి తప్పుకున్నారు. ఇకపై కేవలం ఇన్ స్టా గ్రామ్ ద్వారా మాట్లాడతాను… ట్విట్టర్ నుంచి తప్పుకుంటున్నాను అని గత ఏడాది ఏప్రిల్ 27న చివరి ట్వీట్ చేశారు. తన ట్విట్టర్ ఖాతా 27-05-2009లో పుట్టిందని, 27-5-2017లో మరణించిందని కూడా రాసుకొచ్చారు. అప్పటినుంచి ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ ద్వారా తన అభిప్రాయాలు వ్యక్తపరుస్తూ వచ్చారు.
తాజాగా కొత్త సంవత్సరం రాగానే ఆయన మళ్లీ తన ట్విట్టర్ ఎకౌంట్ రీ యాక్టివేట్ చేశారు. ఈ సందర్భంగా చేసిన మొదటి ట్వీట్ కూడా ఆయన శైల్లోనే సాగింది. ఏసుక్రీస్తు పునరుత్థానంలా… ట్విట్టర్ లో ఇది నా రెండో రాక. కొత్త సంవత్సర శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు. తర్వాత ట్విట్టర్ లో తన రెండో రాకకు కారణం కూడా వర్మ వెల్లడించారు. ఆయన ట్విట్టర్ ఎకౌంట్ రీ యాక్టివేట్ చేయడానికి పవన్ కళ్యాన్ అజ్ఞాతవాసి మూవీ కారణమట. ట్విట్టర్ అజ్ఞాతవాసంలోకి వెళ్లిన తాను పీకే అజ్ఞాతవాసి తో స్ఫూర్తి పొంది మళ్లీ వచ్చానని ట్వీట్ చేశారు. అనంతరం దేశంలో ప్రస్తుతం హాట్ టాపిక్ అయిన రజనీకాంత్ రాజకీయాల గురించి ప్రస్తావించారు. సూపర్ స్టార్ రజనీకాంత్ తన రాజకీయ ప్రవేశం గురించి ప్రకటించిన తీరు, ఆ క్షణం ఆయనలో కనిపించిన పవర్ ను ఇప్పటివరకూ ఆయనలో ఎప్పుడూ చూడలేదని వర్మ పొగిడారు. తన అంచనా ప్రకారం తమిళనాడులోని ప్రతి ఒక్కరూ ఆయనకే ఓటు వేస్తారని, ఆయనకు వ్యతిరేకంగా ఏ రాజకీయ పార్టీ పోటీ చేయాలనుకున్నా అది మూర్ఖత్వం అవుతుందని వర్మ ట్వీట్ చేశారు.