సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసు, డ్రగ్స్ మాఫియాతో సంబంధాలున్నాయని అభియోగాలు ఎదుర్కొంటున్న నటి రియా చక్రవర్తికి మరోసారి చుక్కెదురైంది. ఆమె జ్యుడిషియల్ కస్టడీని అక్టోబర్ 6 వరకు పొడిగిస్తూ ప్రత్యేక న్యాయస్థానం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. డ్రగ్స్ కేసులో నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో అరెస్టు చేసిన మిగతా నిందితులను రేపు కోర్టులో ప్రవేశపెడుతామని పబ్లిక్ ప్రాసిక్యూటర్ అతుల్ సర్పందే తెలిపారు. నిందితుల్లో రియా సోదరుడు షోవిక్ కూడా ఉన్నారు. ఇక సెప్టెంబర్ 11న రియా, మిగతా ఐదుగురు నిందితులు బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా కోర్టు తిరస్కరించింది. నిందితులు ప్రస్తుతం ముంబైలోని బైకుల్లా జైలులో ఉన్నారు. మరోవైపు రియా, ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తి బెయిల్ కోసం మహారాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. వీరి బెయిల్ పిటిషన్ సెప్టెంబర్ 23న విచారణకు రానుంది.
బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ముంబైలోని బాంద్రాలో నివాసంలో జూన్ 14న ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోవడం తెలిసిందే. రియా చక్రవర్తికి సుశాంత్ మాజీ ప్రియురాలు కావడంతో ఆమెపై అనుమానాలు వ్యక్తం చేస్తూ సుశాంత్ తండ్రి పట్నా పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం కేసు సీబీఐకి చేతికి వెళ్లింది. ఈ క్రమంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, నార్కోటిక్స్ విభాగం సైతం రంగంలోకి దిగింది. బాలీవుడ్ డ్రగ్స్ కేసుగా పరిస్థితి మారింది. ఈక్రమంలోనే బాలీవుడ్‌కు చెందిన హీరోయిన్లు సారా అలీ ఖాన్, మరో 15 మంది పేర్లను రియా విచారణలో వెల్లడించినట్టు సమాచారం. రకుల్ ప్రీత్ సింగ్ పేరు కూడా డ్రగ్స్ కేసులో వినిపిస్తోంది.