Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
సినిమాల్లోకి ప్రవేశించి…. సెలబ్రిటీ హోదా అందుకున్న తర్వాత.. ఆ జీవితాన్ని వదులుకునేందుకు ఎవరూ పెద్దగా ఇష్టపడరు. వచ్చిన అవకాశాలు ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్తారు. అవకాశాలు రాకపోతే… ఎలాగోలా ప్రయత్నాలు చేసి సినీరంగంలో స్థిరపడేందుకు శాయశక్తులా కృషిచేస్తారు. సినీరంగంలో ఉండే ఆకర్షణ అది. ఆ ఎట్రాక్షన్ నుంచి బయటపడడం అందరికీ సాధ్యం కాదు. చాలా అరుదుగా కొందరు నటీనటులు మాత్రమే తొలినాళ్లలోనే కెరీర్ కు గుడ్ బై చెప్పి సినీరంగానికి దూరమవుతారు. గోరింటాకు సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించిన వక్కలంక పద్మ ఆ కోవకే చెందుతుంది. ఆ సినిమాతో పద్మకు ఎంతో గుర్తింపు లభించింది. మోడ్రన్ హీరోయిన్ క్యారెక్టర్ లో ఆమె ఒదిగిపోయింది. అప్పట్లో హీరోయిన్లు సంప్రదాయ బద్ధంగా ఉండేవారు గానీ… ఆమెలా మోడ్రన్ గా ఉండే హీరోయిన్లు తక్కువ. దీంతో పద్మకు అవకాశాలు క్యూ కట్టాయి. కానీ ఆమె వాటిని వద్దనుకుని ఉన్నతచదువులకు జర్మనీ వెళ్లిపోయింది. అసలు జర్మనీ వెళ్లేందుకు కావాల్సిన డబ్బుల కోసమే ఆమె గోరింటాకు సినిమాలో నటించింది. ఆ రెమ్యునరేషన్ తో జర్మనీ వెళ్లి అక్కడ ఉన్నతవిద్యనభ్యసించింది. తరువాత… జర్నలిస్టుగా ఢిల్లీలో స్థిరపడింది. గోరింటాకు మినహా ఆమె ఇక ఏ చిత్రంలోనూ నటించలేదు. కనీసం అతిథి పాత్రల్లో కూడా కనిపించలేదు. అలాగే సప్తపది సినిమా హీరోయిన్ సబిత కూడా ఇలానే ఒక్క సినిమాతో కెరీర్ ముగించారు. 1981లో విడుదలైన సప్తపది సంచలన విజయం సాధించింది. క్లాసికల్ డాన్సర్ పాత్రలో నటించిన సబితకు ఎంతో గుర్తింపు లభించింది. సబితను తమ సినిమాల్లో నటింపచేసేందుకు దర్శకనిర్మాతలు పోటీపడ్డారు. కానీ ఆమె తనకొచ్చిన అవకాశాలన్నింటినీ తిరస్కరించి…చదువును పూర్తిచేసుకుని ఉద్యోగంలో స్థిరపడింది. అప్పుడే కాదు… అలాంటి హీరోయిన్లు ఈ తరంలోనూ ఉన్నారు.
లీడర్ ఫేం రిచాగంగోపాధ్యాయ్ కూడా ఈ జాబితాలో చేరారు. ఉన్నతచదువుల కోసం రిచా సినీరంగాన్ని వదిలిపెట్టింది. 2010లో లీడర్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన రిచా… వరుస అవకాశాలు దక్కించుకుంది. మిరపకాయ్, సారొచ్చారు, నాగవల్లి, మిర్చి వంటి చిత్రాల్లో నటించింది. కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడే సినిమాలను వదిలి ఉన్నత విద్యకోసం అమెరికా వెళ్లిపోయింది. వాషింగ్టన్ యూనివర్శిటీ నుంచి ఎంబీఏ పట్టా అందుకుంది. చదువు అయిపోయిన తర్వాత రిచా మళ్లీ సినిమాల్లో నటిస్తుందని అప్పట్లో వార్తలొచ్చాయి. అందుకు తగ్గట్టుగా నెటిజన్లు ఆమెను ట్విట్టర్ లో తదుపరి సినిమా గురించి ప్రశ్నిస్తున్నారు. మళ్లీ సినిమాల్లో ఎప్పుడు నటిస్తున్నారు? ఏవైనా స్టోరీలు విన్నారా…? కొత్త ప్రాజెక్ట్స్ ఏంటి వంటి ప్రశ్నలు సంధింస్తున్నారు. దీంతో తన రీఎంట్రీపై రిచా స్పందించింది. సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చే ఆలోచన లేదని తెలిపింది. తాను సినిమాలను వదిలేసి ఐదేళ్లయిందని, ఇప్పుడు కొత్త జీవితంలో అడుగుపెట్టానని, అందులో నటన అనే అంశమే లేదని స్పష్టంచేసింది. మొత్తానికి సినీరంగం వెలుగుజిలుగుల్ని కాదని…వేరేకెరీర్ ఎంచుకుని రిచా ఆదర్శంగా నిలిచింది.