రోబో 2.0 ఫస్ట్ రివ్యూ వచ్చేసింది…!

Robo 2.0 Movie First Review

550 కోట్ల భారీ బడ్జెట్ తో దర్శకుడు శంకర్ రూపొందిస్తున్న రోబో 2.0 చిత్రం ప్రపంచవ్యాప్తంగా రేపు (గురువారం) విడుదలవుతున్న విషయం తెలిసిందే. 2010 లో వచ్చిన రోబో చిత్రానికి కొనసాగింపుగా వస్తున్న ఈ సినిమాలో రజినీకాంత్ మరియు అమీ జాక్సన్ లు హోమోనోయిడ్ రోబో పాత్రలలో నటిస్తుండగా, బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ తొలిసారి నెగటివ్ రోల్ లో కనిపించబోతున్నాడు. ఈ సినిమాలో 40 శాతం వరకు గ్రాఫిక్స్ ఉంటాయని దర్శకుడు శంకర్ చెప్పడంతో పాటు ట్రైలర్ లో కనిపించిన అబ్బురపరిచే విజువల్ గ్రాఫిక్స్ ఔరా అనిపించాయి. భారత చిత్రసీమలో ఇప్పటివరకు కనిపించని గ్రాఫిక్స్ మాయాజాలం ఈ సినిమాలో చూపించబోతున్నారు. ఈ సినిమాలోని గ్రాఫిక్స్ విజువల్స్ తో ప్రేక్షకులని మరింత సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తడానికి 3D లో కూడా విడుదల చేస్తున్నారు. ఈ సినిమాకి పెట్టిన పెట్టుబడిలో నాలుగవ వంతు సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా వచ్చేశాయని అంటున్నారు.

robo-2.0

సినిమా ప్రీమియర్స్ కూడా రేపు ఉండగా, బజ్ ఎక్కువగా ఉండే సినిమాలకి ఒక రోజు ముందుగానే రివ్యూ ఇచ్చే, దుబాయ్ కి చెందిన సెన్సారుబోర్డు సభ్యుడు, ఏషియన్ మూవీస్ మార్కెటింగ్ ఎక్సపర్ట్ గా ఉన్న సినీ విశ్లేషకుడు ఉమైర్ సంధు రోబో 2.0 సినిమాకి కూడా రివ్యూ ఇచ్చాడు అతని ట్విట్టర్ అకౌంట్లో. ఇతని రివ్యూలో రజినీకాంత్ సినిమా మొదటి నుండి చివరి వరకు ప్రేక్షకులను అలరించాడని, రజినీలా కనీసం బాలీవుడ్ యాక్టర్స్ కూడా చేయలేరని, అమీ జాక్సన్ కూడా చాలా ఆకట్టుకుందని తెలిపాడు. సినిమాలో స్క్రీన్ ప్లే చాలా బాగా రాశారని, సినిమా మొత్తం ఒక సూపర్ రైడ్ అని, ఒకవేళ ఈ సినిమాని రజినీకాంత్ వీరాభిమానులు చూడకుంటే రజినీకాంత్ చేసిన విన్యాసాలను ఖచ్చితంగా మిస్ అవుతారని పేర్కొని, సినిమాకి 4 రేటింగ్ ఇచ్చాడు. ఇదంతా బాగానే ఉన్నా, ఉమైర్ సంధు ఇచ్చే రివ్యూ ని ఎవరూ కూడా సీరియస్ గా తీసుకోరు. ఎందుకంటే తాను ఇదివరకు ఇచ్చిన సినిమా రివ్యూలలో చాలా సినిమాలు ప్లాప్ అయ్యాయి. కాబట్టి ఉమైర్ సందు ఇచ్చిన రోబో 2.0 కి అతను ఇచ్చిన రివ్యూ ఎంతవరకు సహాయపడుతుందో వేచి చూడాలి.