సూపర్ స్టార్ రజినీకాంత్, శంకర్ల కాంబినేషన్లో తెరకెక్కిన ‘2.0’ చిత్రం గత సంవత్సర కాలంగా వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తుంది. ఎట్టకేలకు ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు ప్రకటించారు. రెండున్నర సంవత్సరాల క్రితం ప్రారంభించిన ఈ చిత్రం విఎఫ్ఎక్స్ వర్క్ పూర్తి కానందు వల్ల విడుదల వాయిదాలు పడుతూ వస్తుంది. గత సంవత్సరం చివర్లో అన్నారు, ఆ తర్వాత సంక్రాంతికి అనుకున్నారు. తాజాగా సమ్మర్లో అనుకున్నారు. కాని గ్రాఫిక్స్ వర్క్ పూర్తి కాకపోవడంతో వాయిదాల పర్వం కొనసాగిస్తూ వచ్చారు. ఇక చిత్ర యూనిట్ సభ్యులు చెప్పకుండానే ఈసారి అంతా కూడా వచ్చే ఏడాది సంక్రాంతికి చిత్రం వస్తుందని భావించారు. కాని అనూహ్యంగా చిత్రాన్ని నవంబర్‌లో విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటన వచ్చింది.
తమిళనాడు మరియు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా ఈచిత్రం కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. హాలీవుడ్లో సైతం ఈ చిత్రాన్ని భారీ ఎత్తున విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. దుబాయిలో ఈ చిత్రం ఆడియోను ఏ రేంజ్లో నిర్వహించారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అంతటి భారీ చిత్రాన్ని నవంబర్ 29న విడుదల చేయాలని నిర్ణయించారు. గ్రాఫిక్స్ వర్క్ 90 శాతంకు పైగా పూర్తి అయ్యాయని, త్వరలోనే పూర్తి చేసి ఫస్ట్‌కాపీని సిద్దం చేస్తామని దర్శకుడు శంకర్ ప్రకటించాడు. లైకా ప్రొడక్షన్స్ మరియు శంకర్ విడుదలపై క్లారిటీ ఇవ్వడంతో రజినీకాంత్ ఫ్యాన్స్ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. రెండు వేల కోట్ల కలెక్షన్స్ టార్గెట్‌గా ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. అయితే ఈ డేట్‌కు అయినా చిత్రాన్ని విడుదల చేస్తారా అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.