ఆస్ట్రేలియా జట్టులో ఇప్పుడు స్మిత్, వార్నర్ ఉండటంతో ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియాతో సిరీస్ కాస్త భిన్నంగానే జరుగుతుందని, మునుపటిలా ఉండదని భారత స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ అన్నాడు. 2018–19లో వాళ్లిద్దరిపై నిషేధం ఉండటంతో ఆడలేకపోయారు. భారత్ 2–1తో టెస్టు సిరీస్ నెగ్గి చరిత్ర సృష్టించింది. కరోనా మహమ్మారి అదుపులోకి వచ్చి ఈ సిరీస్ను ఆడనిస్తే తప్పకుండా భారత్, ఆసీస్ మధ్య పోరు రసవత్తరంగా జరుగుతుందని రోహిత్ శర్మ అన్నాడు.
ప్రస్తుత టీమిండియా దుర్భేద్యంగా ఉందని ఇలాంటి జట్టు తమకు దీటైన జట్టే ఎదురుపడాలనుకుంటుందని… స్మిత్, వార్నర్లు ఉన్న ఆసీస్ జట్టుతో తప్పకుండా రోమాంచకరమైన సిరీస్ జరుగుతుందని స్టార్ ఓపెనర్ వివరించాడు. అక్టోబర్లో మొదలయ్యే కంగారూ పర్యటన జనవరి దాకా సాగుతుంది. అయితే మధ్యలో టి20 ప్రపంచకప్ కూడా అక్కడే జరుగుతుంది. కానీ ఇవన్నీ కూడా ఇప్పుడు కోవిడ్–19పైనే ఆధారపడ్డాయి.