రొనాల్డో ఇంట్లో తీవ్ర విషాదం

రొనాల్డో ఇంట్లో తీవ్ర విషాదం

ప్రఖ్యాత ఫుట్‌బాల్‌ ఆటగాడు, పోర్చుగల్‌ కెప్టెన్ క్రిస్టియానో రొనాల్డో కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అతడి నవజాత కుమారుడు మరణించాడు. ఈ విషయాన్ని రొనాల్డో సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించాడు. తమ జీవితాల్లో అత్యంత విషాదకరమైన రోజు అంటూ భావోద్వేగానికి లోనయ్యాడు.

ఈ మేరకు.. ‘‘మా చిన్నారి కుమారుడు మమ్మల్ని శాశ్వతంగా వదిలివెళ్లిపోయాడని చెప్పడానికి చింతిస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి తల్లిదండ్రులు ఎలాంటి వేదనను అనుభవిస్తారో మా పరిస్థితి అలాగే ఉంది. ఈ క్షణంలో మా చిన్నారి కూతురు జననమే మాకు కాస్త ఊరటనిస్తోంది. మా పిల్లల విషయంలో శ్రద్ధ చూపుతూ వారిని కంటికి రెప్పలా కాచిన నర్సులు, డాక్టర్లకు ధన్యవాదాలు.

ఇలాంటి కష్ట సమయంలో మా ప్రైవసీకి భంగం కలగకుండా వ్యవహరించాలని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాం. మా చిన్నారి బాబూ.. నువ్వు దేవదూతవి. నిన్ను మేము ఎల్లప్పుడూ ప్రేమిస్తూనే ఉంటాం’’ అని తన సహచరి జార్జినా రోడ్రిగ్జ్‌తో కలిసి రొనాల్డో సంయుక్త ప్రకటన విడుదల చేశాడు. కాగా తాము మరోసారి తల్లిదండ్రులం కాబోతున్నామంటూ రొనాల్డో, జార్జినా గతేడాది అక్టోబరులో ప్రకటించిన సంగతి తెలిసిందే.

కవలలు పుట్టబోతున్నారంటూ సంతోషాన్ని పంచుకున్నారు. ఈ క్రమంలో సోమవారం వారికి కవల పిల్లలు జన్మించారు. వీరిలో నవజాత కుమారుడు అనారోగ్యంతో మృతి చెందినట్లు తెలుస్తోంది. ఇక రొనాల్డోకు ఇప్పటికే నలుగురు సంతానం. జార్జినాతో గతంలో ఓ కూతురు ఉండగా.. తాజాగా మరో కుమార్తె జన్మించింది.