ఏపీ కొత్త డీజీపీ ఈయనే…

RP Thakur appointed as new DGP for AP

ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత డీజీపీగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఎం.మాలకొండయ్య పదవీ విరమణ పొందారు. ఈ సందర్భంగా పోలీస్‌ ఉన్నతాధికారులు ఆయనకు ఆత్మీయ వీడ్కోలు పలికారు. శనివారం మంగళగిరి బెటాలియన్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. అయితే తదుపరి ఏపీ కొత్త డీజీపీగా ఆర్‌.పి ఠాకూర్ నియమితులయ్యారు. ఈమేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నేటితో డీజీపీ మాలకొండయ్య పదవీ విరమణ సమయం పూర్తవడంతో కొత్త డీజీపీ ఠాకూర్‌ను ఖరారు చేశారు చంద్రబాబు. ప్రస్తుతం ఆర్పీ ఠాకూర్ ఏసీబీ డీజీగా ఉన్నారు. ఠాకూర్ వచ్చాక అవినీతి అధికారుల భరతం పట్టారు. దీంతో డీజీపీగా ఠాకూర్ నియమించేంది అనుమానమే అని సావంగ్‌కే అవకాశం ఉందని మొదట ప్రచారం జరిగింది. డీజీపీ ఎంపికపై చంద్రబాబుతో అధికారులు భేటీ అయ్యారు. ఆ తరువాత చంద్రబాబు అన్ని కోణాల్లోనూ ఆలోచించి చివరకు ఠాకూర్ వైపు మొగ్గు చూపారు.

1986 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి ఆర్.పి. ఠాకూర్ ఐఐటీ కాన్పూర్‌లో సివిల్ ఇంజినీరింగ్ విభాగంలో బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ చదివారు. ఠాకూర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పలు ప్రాంతాల్లో కీలక బాధ్యతలు నిర్వహించారు. హైదరాబాద్‌లోని జాతీయ పోలీసు అకాడమీలో అదనపు ఎస్పీగా 1986 డిసెంబర్ 15న ఐపీఎస్ అధికారిగా తొలి నియామకం జరిగింది. అనంతరం గుంటూరు, వరంగల్ జిల్లాల్లో ఏఎస్పీగా, అలాగే పశ్చిమగోదావరి, కడప, కృష్ణా, వరంగల్ జిల్లాల ఎస్పీలుగా ఠాకూర్ బాధ్యతలు నిర్వహించారు. జోనల్ హైదరాబాద్ డీసీపీగా, అనంతపురం, చిత్తూరు జిల్లాల డీఐజీగా, పాట్నాలోని ఈస్ట్రన్ జోన్ హెడ్ క్వాటర్స్(సీఐఎస్‌ఎఫ్) డీఐజీగా బాధ్యతలు నిర్వహించారు. ఇంకా మరెన్నో చోట్ల బాద్యతలు నిర్వర్తించిన ఆర్పీ ఠాకూర్‌ను ఏపీ కొత్త డీజీపీగా ప్రభుత్వం నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో డీజీ హోదాలో రాష్ట్రంలో పోలీసు దళాల అధిపతి ఆర్.పి.ఠాకూర్ బాధ్యతలు చేపట్టనున్నారు.