రహస్యంగా ఆర్ఆర్ఆర్ షూటింగ్…జక్కన్న ప్లాన్

RRR Shoot going on secretly

బాహుబలి, బాహుబలి 2 తర్వాత దర్శకుడు రాజమౌళి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ మల్టీస్టారర్‌ను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.  ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ లో ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్ర‌లో క‌నిపించ‌నుండ‌గా, రామ్ చ‌ర‌ణ్ అల్లూరి సీతారామ‌రాజు గెట‌ప్‌లో క‌నిపించనున్నాడు. స్వాతంత్య్ర సమర యోధులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీం జీవిత చరిత్రలను బేస్ చేసుకొని రాజ‌మౌళి ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు. అయితే జూనియ‌ర్ ఎన్టీఆర్, రామ్‌చ‌ర‌ణ్ గాయ‌ప‌డ్డ కార‌ణంగా ఆర్ఆర్ఆర్ చిత్ర షూటింగ్‌కి కొన్ని వారాల పాటు బ్రేక్ ప‌డిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్ట‌రీలో వేసిన భారీ సెట్‌లో ఎన్టీఆర్‌పై కీల‌క స‌న్నివేశాలు చిత్రీక‌రిస్తున్న‌ట్టు తెలుస్తుంది. కొమురం భీం పాత్ర‌లో న‌టిస్తున్న ఎన్టీఆర్ బ్రిటీష్ సైనికుల‌తో త‌ల‌ప‌డే స‌న్నివేశాల‌ని రాజ‌మౌళి చిత్రీక‌రించాడ‌ట‌. భారీ యాక్ష‌న్ ఎపిసోడ్‌గా రూపొంద‌నున్న ఈ సీన్ సినిమాకే హైలైట్‌గా నిలుస్తుంద‌ని అంటున్నారు. ప్ర‌స్తుతం రామ్ చ‌ర‌ణ్ విహారయాత్ర‌లో ఉండ‌గా, ఆయ‌న హైద‌రాబాద్‌కి రాగానే షూటింగ్‌లో పాల్గొన‌నున్న‌ట్టు తెలుస్తుంది. నిజానికి సినిమా షూటింగ్ సమయంలో ఎవరో కొన్ని ఫోటోలు తీసి నెట్ లో లీక్ చేశారు. ఈ పరిణామాలతో రాజమౌళి ఈ లీకేజ్ పబ్లిసిటీకి చెక్ పెట్టాలనుకున్నాడట. అందుకే, ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ హైద్రాబాద్‌లోనే జరుగుతోన్నా ఎక్కడా హడావిడి కనిపించటం లేదు. సెట్ మీదకి మొబైల్ ఫోన్స్‌తో పాటూ ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు అనుమతించడం లేదట. అజ‌య్ దేవ‌గ‌ణ్‌, సముద్ర‌ఖ‌ని కీల‌క పాత్ర‌ల‌లో న‌టించ‌నున్నారు. జూలై 30  2020వ సంవత్సరంలో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. డీవీవీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ప‌తాకంపై దానయ్య నిర్మిస్తోన్న ఈ సినిమాకి కీరవాణి సంగీతాన్ని సమకూర్చుతున్నారు.