పరిషత్ ఎన్నికలలోనూ కారు జోరు..

car speed in parishad elections

తెలంగాణలో ఈ ఉదయం ప్రారంభమైన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. అయితే, కొన్ని చోట్ల బ్యాలెట్ బాక్సులకు చెదలు పట్టడం, వర్షం నీరు చేరిన ఘటనలు చోటుచేసుకున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్‌పూర్ మండలం అంబటిపల్లి సూరారం ఎంపీటీసీ, మహాదేవ్‌పూర్ జడ్పీటీసీ బ్యాలెట్ బాక్సులకు చెదలు పట్టడంతో బ్యాలెట్ పేపర్లు చిరిగిపోయాయి. అలాగే అసిఫాబాద్ జిల్లా కౌటాల మండంలోని తలోడి ఎంపీటీసీ బ్యాలెట్ బాక్సుకు కూడా చెదలుపట్టాయి. ఇందులోని 479 బ్యాలెట్ పత్రాలకు చెదలుపట్టి కొరికేయడంతో ఏజెంట్లు అభ్యంతర తెలిపారు. బ్యాలెట్లకు చెదలుపట్టడంతో అధికారులు జుట్టుపీక్కుంటున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా సీసీ కుంట అమరచింతలో రెండు పోస్టల్ బ్యాలెట్ బాక్సుల్లోకి వర్షపునీరు చేరింది. దీంతో అందులోని బ్యాలెట్ పత్రాలు తడిసిపోయాయి. దీనిపై కలెక్టర్‌కు అధికారులు సమాచారం ఇచ్చి, లెక్కింపు నిలిపివేశారు. కాగా, కొన్ని చోట్ల ఎంపీటీసీ ఫలితాలు వెల్లడవుతున్నాయి.ఇప్పటి వరకు 1653 ఎంపీటీసీ స్థానాల ఫలితాలు వెలువడ్డాయి. వీటిలో టీఆర్‌ఎస్‌ 1073 ఎంపీటీసీ స్థానాలు గెలుచుకోగా, కాంగ్రెస్‌ 334, బీజేపీ 79, ఇతరులు 167 ఎంపీటీసీ స్థానాలను గెలుచుకున్నాయి.