అమీర్‌పేటలో బీభత్సం సృష్టించిన ఆర్టీసీ సిటీ బస్సు

అమీర్‌పేటలో బీభత్సం సృష్టించిన ఆర్టీసీ సిటీ బస్సు

హైదరాబాద్‌లోని అమీర్‌పేటలో సోమవారం ఉదయం ఆర్టీసీ సిటీ బస్సు బీభత్సం సృష్టించింది. సికింద్రాబాద్ నుంచి బాచుపల్లి వెళ్తున్న మియాపూర్-1 డిపో బస్సు ముందు చక్రం అమీర్‌పేట  దగ్గరకు వచ్చేసరికి టైర్ పంక్చర్ అయింది. దీంతో డ్రైవర్ బస్సును అదుపు చేయలేక పక్కనే ఉన్న దుకాణాల వైపు మళ్లించాడు. దీంతో బస్సు దుకాణాలను ఢీకొని ఆగిపోయింది.

ఈ ఘటనలో ముగ్గురు మహిళలు గాయపడినట్లు తెలుస్తోంది. ఉదయం వేళ కావడంతో బస్సులో ఎక్కువ మంది ప్రయాణికులు లేరు. డ్రైవర్ చాకచక్యంతో దుకాణాల వైపు బస్సును మళ్లించడంతోనే పెను ప్రమాదం తప్పిందని, జనాల వైపు దూసుకెళ్తే ప్రాణనష్టం జరిగేదని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ప్రమాద సమాచారం తెలుసుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని సహాయచర్యలు చేపట్టారు. ప్రధాన రహదారిపై వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్ పోలీసులు రాకపోకలు పునరుద్ధరించారు.