కంటతడి పెట్టించిన కేసీఆర్ కి ఆర్టీసీ కండక్టర్ రాసిన లేఖ

కంటతడి పెట్టించిన కేసీఆర్ కి ఆర్టీసీ కండక్టర్ రాసిన లేఖ

సమ్మెకు దిగిన కార్మికులను ఉద్యోగాల్లోకి తీసుకునే ప్రసక్తే లేదని తెగేసి చెబుతున్న కేసీఆర్ వైఖరికి నిరసనగా ఆర్టీసీకి చెందిన ఓ కార్మికుడు ఏకంగా తన ఉద్యోగానికి రాజీనామా చేసి పారేశారు. ఈ సందర్భంగా ఊరికే తన ఉద్యోగానికి రాజీనామా చేసి వెళ్లడం కాకుండా తన ఆవేదనను ఓ లేఖ రూపంలో విడుదల చేసిన సదరు కార్మికుడు కేసీఆర్ నియంతృత్వ వైఖరి ఎలా సాగుతుందన్న విషయాన్ని కళ్లకు కట్టాడనే చెప్పాలి. ప్రస్తుతం ఈ లేఖ వైరల్ గా మారిపోయింది. సూర్యాపేట ఆర్టీసీ డిపోలో కండక్టర్ గా పనిచేస్తున్న ఎల్. కృష్ణ తన ఉద్యోగానికి రాజీనామా చేస్తూ కేసీఆర్ కు ఈ లేఖ రాశారు.

ఈ లేఖ ఎలా సాగిందన్న విషయానికి వస్తే… ‘ ఆత్మాభిమానాన్ని చంపుకొని ఉద్యోగం చేయలేను. నా ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నాను. ఆత్మగౌరవంతో కాదు కదా… తెలంగాణలో ఎందుకు పుట్టాను రా నాయనా అనుకునే విధంగా పరిస్థితి ఉన్నందున తీవ్ర మానసిక వేదనకు గురై నేను ఈ నిర్ణయం తీస్కుంటున్నాను. మాట తప్పడం, మాయ మాటలు చెప్పి మోసం చెయ్యడం మీకు తెలుసని మా కార్మికలోకం ఆలస్యంగా తెలుసుకుంది. మీరు ఉద్యోగం లో నుండి తీసేయడం కాదు. నేనే నా ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నాను. దీనికి కారణం లేకపోలేదు. సర్… మా తెలంగాణలో నియంతృత్వం చూస్తామని అనుకోలేదు. రాష్ట్రం కోసం 1,200 మంది ఆత్మహత్య చేసుకుంటే మన కేసీఆర్ సర్ ఉన్నారని, బతుకులు బంగారు బాట పడతాయని ఆశించాం.

ఇక… ఆంధ్ర పాలకులు నిజంగా మోసం చేశారేమోనని, మీరు మమ్మల్ని బాగా చూసుకుంటారని అనుకున్నాం. కానీ… సర్, 20 మందికి పైగా కార్మికులు చనిపోతే మీరు కనీసం స్పందించలేదు. అప్పుడనిపించింది సర్… తెలంగాణ మా కోసం కాదు. కేవలం మీ లాంటి నాయకుల కోసమేనని. నా అక్కచెల్లెమ్మలు లాఠీ దెబ్బలు తింటారని కలలో కూడా ఉహించలేదు సర్. కానీ మీ బంగారు తెలంగాణలో అది సాధ్యమైంది సర్.

నా చెల్లెలు ఏడుస్తుంటే, రోజు నా సోదరులు బాధ పడుతుంటే తట్టుకోలేక పోతున్న. కానీ ఒక్కటి మాత్రం నిజం సర్. నా ఆర్టీసీ అక్క, చెల్లెళ్ళ ఉసురు ఖచ్చితంగా మీకు తగులుతుంది సర్. నేను సూర్యాపేట డిపో లో కండక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న. మీలాంటి ఒక మోసకారి, ఒక మాటకారి, ఒక మానవత్వం లేని మనిషి ఆధ్వర్యంలోని ప్రభుత్వంలో నా ఆత్మభిమానాన్ని చంపుకొని ఉద్యోగిగా పని చేయలేను. అందుకే నా ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నా. నా పేరు యల్. కృష్ణ, నా స్టాప్ నెంబర్ 176822, సూర్యాపేట డిపో సర్.

మీ సంస్థ నుండి నాకు రావాలిసిన బకాయిలను ఇప్పించి నా రాజీనామాను ఆమోదించగలరని నా మనవి. అయ్యా సీఎం సర్ గారు… మీరు ఉద్యమ నాయకుడిగా ఉన్నప్పుడు మాట్లాడిన మాటలు ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి. ఇప్పుడు మీ వైఖరిని గుర్తు చేసుకోండి. సర్, పాపం ఆర్టీసీ వాళ్ళు మిమ్మల్ని చాలా అభిమానించారు. కానీ మీరు ఇలా చేస్తారని కలలో కూడా ఉహించి ఉండరు సర్.

పాపం ఆర్టీసీ వాళ్ళు ఆ వచ్చే రూ. 16 వేల జీతం తీసుకొని ఫ్యామిలీని చూసుకుంటూ చాలా గౌరవంగా బ్రతుకుతున్నారు సర్. మీరూ వాళ్లకు ఏమి ఇవ్వకపోయినా… కనీసం పిలిచి మాట్లాడి ఉంంటే మీమీద గౌరవంతో ప్రాణాలు ఇచ్చేవారు సర్. నేను మీ బంగారు తెలంగాణలో సంతోషంగా లేను. కనీసం మా తలిదండ్రులైనా సంతోషంగా ఉండేట్లు నెల నెలా వాళ్ళకి వృద్ధాప్య పింఛన్ ఇవ్వండి. ఎందుకంటే మిమ్ములను నమ్మారు. మా కేసీఆర్ అంటూ ఓటు వేశారు సర్. వాళ్ళు బాధపడుతుంటే, సమాజంలో ప్రతీ ఒక్కరు చిన్న చూపు చూస్తుంటే, ప్రతి ఒక్కరు నన్ను దీనంగా చూస్తుంటే తట్టుకోలేక పోయాను సర్.

ప్రతి రోజు ఈ అరెస్టులు ఏంది ? ఈ లాఠీ దెబ్బలు ఏంది ? నా ఆర్టీసీ సోదరులు ఏం తప్పు చేశారు ? ఇంకా ఎంత మంది ఆత్మహత్యలు చేసుకునేట్లు చేస్తారు? నేను మీ బంగారు తెలంగాణలో ఉద్యోగం కోల్పోయిన ఉద్యోగిని కాదు. మీ మాయ మాటలు నమ్మి మోసపోయిన తెలంగాణ సమాజంలోని వ్యక్తిని. నీ తెలంగాణ రాష్ట్రంలో ఓ నిరుద్యోగిగా ఉన్నాను కాబట్టి తక్షణమే నా తల్లిదండ్రులకు వృద్ధాప్య పింఛను ఒక్కటి ఇవ్వండి.

నా పేరు మీద సెంటు భూమి లేదు కాబట్టి మూడు ఎకరాల పొలం, అలాగే నా పిల్లలకి ప్రభుత్వ స్కూల్లో చదువు, నాకు ఉండడానికి ఇల్లు లేదు కనుక డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వండి. ఒకవేళ మీరు ఏమీ ఇవ్వకున్నా… సమాజంలో గౌరవంగా బ్రతికే అవకాశం కల్పించాలని కోరుతున్నాను. అలాగె నా రాజీనామాను తక్షణమే ఆమోదించగలరని కోరుతున్నా’ అంటూ సదరు లేఖలో కేసీఆర్ ను ఓ రేంజిలో దునుమాడుతూ కృష్ణ లేఖ రాశారు. ఈ లేఖ ఇఫ్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.