ఉక్రెయిన్‌లో రష్యన్ సైన్యాలు దాడుల పరంపర కొనసాగుతోంది. పలు ప్రాంతాల్లో బాంబులు, క్షిపణులు, రాకెట్లతో విరుచుకుపడుతోంది. కీవ్ పరిసర ప్రాంతాల నుంచి పుతిన్ సేనలు వెనుదిరిగినప్పటికీ మిగతా చోట్ల విధ్వంసాన్ని కొనసాగిస్తూ సాధారణ పౌరులను పొట్టనబెట్టుకుంటున్నాయి. తాజాగా డొనెట్స్స్ ప్రాంతం క్రమటోర్స్క్ రైల్వే స్టేషన్‌పై రెండు క్షిపణులతో దాడికి పాల్పడింది. ఈ ఘటనలో ఇప్పటి వరకూ 39 మంది మృతిచెందగా.. 100 మందికిపైగా గాయపడినట్టు ఉక్రెయిన్ సెక్యూరిటీ విభాగం వెల్లడించింది.
మృతుల సంఖ్య 39కి చేరినట్టు డొనెట్క్స్ గవర్నర్ తెలిపారు. వేలాది మంది ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లేందుకు రైల్వే స్టేషన్ వద్ద వేచి ఉండగా దాడులతో రష్యా విరుచుకుపడిందని ఆవేదన వ్యక్తం చేశారు. క్షిపణి దాడులతో ఆ ప్రాంతమంతా జనం హాహాకారాలు, ఆర్తనాదాలతో దద్దరిల్లింది. మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయి భయానక పరిస్థితులు నెలకున్నాయి. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న సమయంలో రైల్వేస్టేషన్‌పై దాడులు జరగడంతో భారీ ప్రాణ నష్టం సంభవించింది.
అయితే, ఈ ఘటనతో తమకు సంబంధం లేదని, తాము ఈ తరహా క్షిపణి దాడులకు పాల్పడలేదని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అంతేకాదు, ఈ దాడి ఉక్రెయిన్ సైన్యం పనేనని ప్రత్యారోపణలు చేయడం గమనార్హం. మరోవైపు, ఖార్కివ్ నగరం రష్యన్ల కాల్పుల మోతతో దద్దరిల్లుతోంది. గత 24 గంటల వ్యవధిలో 48సార్లు కాల్పులు చోటుచేసుకోగా.. 15మంది గాయపడినట్టు ఖార్కివ్ గవర్నర్ వెల్లడించారు. ఖార్కివ్, డెర్హాచిలోని జనావాసాలపై దాడికి ఫిరంగిలు, యుద్ధ ట్యాంకులు, మల్టీ-బ్యారెల్ రాకెట్ వ్యవస్థలను క్రెమ్లిన్ సైన్యాలు వినియోగించాయని తెలిపారు.
అటు, రష్యా దాడులను ఉక్రెయిన్ బలగాలు దీటుగా తిప్పికొడుతున్నాయి. రష్యా దండయాత్ర మొదలైనప్పటి నుంచి 19వేల మందికి పైగా మాస్కో సైనికుల్ని చంపినట్టు ఉక్రెయిన్ రక్షణశాఖ ప్రకటించింది. 150 విమానాలు, 135 హెలికాప్టర్లు, 700 యుద్ధ ట్యాంకులు, 1891 ఆయుధ శకటాలతో పాటు భారీగా యుద్ధ సామగ్రిని ధ్వంసం చేసినట్టు పేర్కొంది.ఉక్రెయిన్‌లో పౌర హత్యలకు బాధ్యతను రష్యా నిరాకరించింది.
తమా సేనలు మార్చి 30 నాటికి ఉక్రెయిన్ నుంచి వెనుదిరిగినట్లు చెబుతోంది. మరో వైపు యుద్ధ నేరాలకు సంబంధించిన నివేదికలు అంతర్జాతీయ మానవ హక్కుల చట్టం ఉల్లంఘనపై తీవ్రమైన ప్రశ్నలను లెవనెత్తుతున్నాయి. ఉక్రెయిన్‌తో యుద్ధం చేస్తున్న రష్యాపై అమెరికా సహా పశ్చిమ దేశాలు ఆంక్షల కొరడా ఝుళిపించాయి. సోవియట్ యూనియన్ పతనం తర్వాత తొలిసారి రష్యా తీవ్ర మాంద్యంలోకి వెళుతోందని బ్రిటన్ అంచనా వేసింది. ఇటీవల వారాల్లో అంతర్జాతీయ ఆంక్షల కారణంగా 458.52 బిలియన్ డాలర్ల మాస్కో సంపద నిలిచిపోయిందని పేర్కొంది.