రష్యా బెదిరింపులు

రష్యా బెదిరింపులు

ఉక్రెయిన్‌ దాడిని నిరసిస్తూ ప్రపంచ దేశాలు చెబుతున్న హిత వ్యాఖ్యలను రష్యా బేఖాతర్‌ చేస్తోంది. అంతేకాదు మా మీద ఆంక్షలు పెట్టుకుంటూ పోతే మీకే నష్టమంటూ దబాయిస్తోంది. తాము అన్నింటికీ సిద్ధపడే ఉన్నమని.. ఆంక్షల వల్ల తలెత్తే పరిమాణాలకు మీరు సిద్ధంగా ఉన్నారా అంటూ యూరప్‌ దేశాలను ప్రశ్నిస్తోంది.

ప్రపంచ ఆయిల్‌ సరఫరాలో రష్యాది 10 శాతం వాటాగా ఉంది. ఇక యూరప్‌ గ్యాస్‌ అవసరాల్లో 40 శాతం రష్యా నుంచే సరఫరా అవుతోంది. అయితే ఉక్రెయిన్‌పై రష్యా దాడి నేపథ్యంలో అమెరికాతో పాటు దాని మిత్రపక్ష దేశాలు, యూరోపియన్‌ యూనియన్‌ దేశాలు వరుసగా ఆర్థిక ఆంక్షలు విధిస్తున్నాయి. తాజాగా మరో అడుగు ముందుకు వేసి రష్యా నుంచి చమురు, గ్యాస్‌ దిగుమతులు ఆపేస్తామనే వరకు హెచ్చరికలు వెళ్లాయి.

రష్యా నుంచి చమురు, గ్యాస్‌ను దిగుమతి చేసుకోకూడదని యూరప్‌ దేశాలు భావిస్తే నిక్షేపంగా ఆ పని చేయవచ్చంటూ తమకేమీ అభ్యంతరం లేదని చెబుతున్నాడు రష్యా ఉప ప్రధాని అలెగ్జాండర్‌ నోవాక్‌. రష్యా దిగుమతులు వద్దని మీరు భావిస్తే బ్యారెల్‌ ముడి చమురు ధర పెరుగుదలకు అంతే ఉండదు. ఒక్క బ్యారెల్‌ ధర 300 డాలర్లకు చేరుకున్నా ఆశ్చర్యపోవాల్సిన పని లేదంటూ యూరప్‌ దేశాలను భయపెట్టే ప్రయత్నం చేశారు.

యుద్ధం వల్ల తలెత్తే పరిస్థితులను ఎదుర్కొనేందుకు తమ దేశం సిద్ధంగా ఉందని. కానీ రష్యాపై విధించే ఆంక్షల కారణంగా వచ్చే పరిణామలు ఎదుర్కోవడానికి మీరు సిద్ధంగా ఉండండి అంటూ చెప్పుకొచ్చారు నోవాక్‌. పెరిగే పెట్రోలు, డీజిల్‌ ధరలపై ఇ‍ప్పుడే మీ దేశ ప్రజలకు, వినియోగదారులకు చెప్పండి అంటూ సూచిస్తున్నారు నోవాక్‌. యూరోపియన్‌ యూనియన్‌ ఆంక్షలకు భయపడేది లేదంటూ పశ్చిమ దేశాలకు వార్నింగ్‌ ఇచ్చారాయన.

గత మూడు నెలలుగా ముడి చమురు ధరలు పెరుగుతున్నాయి. ఉక్రెయిన్‌ ఉద్రిక్తలకు ముందు బ్యారెట్‌ క్రూడ్‌ ఆయిల్‌ ధర 70 డాలర్ల నుంచి 80 డాలర్ల మధ్య ట్రేడయ్యింది. ఇక యుద్దం మొదలై ఊపందుకున్న తర్వాత బ్యారెల్‌ ధర ఏకంగా 140 డాలర్లకు కూడా టచ్‌ చేసింది. ఈ నేపథ్యంలో బ్యారెల్‌ ధర ఏకంగా 300 డాలర్లకు చేరుకోవచ్చంటూ రష్యా ఉప ప్రధాని చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.