కొందరు దుండగులు సింహం కూన కాళ్లు విరిచేసి, హింసలు పెడుతూ అమానుషంగా ప్రవర్తించిన ఘటనపై దేశాధ్యక్షుడు వ్లాదమిర్ పుతిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సింబపై దారుణానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వివరాల్లోకి వెళితే.. రష్యాలోని డెగాస్తాన్ ప్రాంతంలో వారాల పిల్లగా ఉన్నప్పుడే సదరు సింహాం కూనను తల్లినుంచి వేరు చేశారు దుండగులు. అనంతరం రష్యన్ బీచులలోని టూరిస్టులతో ఫొటోలకు ఫోజివ్వటానికి దాన్ని వాడుకునేవారు. అంతేకాకుండా సింహం కూనను తీవ్ర చిత్రహింసలకు గురిచేశారు. అది పెద్దదైన తర్వాత తమనుంచి పారిపోయే అవకాశం ఉంటుందని భావించి సింబ రెండు కాళ్లు విరిచేశారు.
అది దారుణ స్థితిలో నడవటానికి కూడా ఇబ్బంది పడుతున్నా టూరిస్టులతో ఫొటోలు దింపటం మాత్రం మానలేదు దుండగులు. దాని ఆరోగ్యం కొద్దికొద్దిగా క్షీణిస్తూ వచ్చింది. తీవ్రంగా కొట్టడంతో శరీరంపై పలు చోట్ల గాయాలు కూడా అయ్యాయి. వెన్నెముకకు దెబ్బ తగలటంతో చావుకు దగ్గరపడింది. అయితే సింబ పరిస్థితిని గుర్తించిన కొంతమంది వ్యక్తులు.. దుండగుల నుంచి దాని రక్షించి మెరుగైన వైద్యం చేయించారు. ప్రస్తుతం అది కోలుకుంటోంది.. అడుగులో అడుగు వేస్తూ నడవగలుగుతోంది. ప్రస్తుతం సింహం కూనకు సంబంధించిన న్యూస్ సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.