ఉక్రెయిన్ రాజధాని కీవ్ లక్ష్యంగా 8 బాలిస్టిక్ క్షిపణులను రష్యా సోమవారం ప్రయోగించింది. వాటిని ఉక్రెయిన్ వైమానిక దళం కూల్చేసింది. ఈ దాడిని తిప్పి కొట్టినప్పటికీ.. క్షిపణి శకలాలు పడి ఒకరికి గాయాలయ్యాయని అధికారులు తెలిపారు. స్థానిక కాలమానం ప్రకారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో కీవ్‌లో భారీ పేలుళ్లు చోటుచేసుకున్నాయి. అనంతరం నగరంలో సైరన్లు మోగాయి. తూర్పు కీవ్‌లోని డార్ని టిస్కీ జిల్లాలో.. నేలకూల్చిన శకలాలు పడ్డాయని హోం మంత్రి ఇహోర్ క్లైమెంకో తెలిపారు. అయితే అవి మంటలు అంటుకోలేదన్నారు. కొన్నిచోట్ల జరిగిన పేలుడు వల్ల ఉత్పన్నమైన ప్రకంపనల ధాటికి ఇళ్ల కిటికీలు దెబ్బ తిన్నాయని తెలిపారు. ఈ దాడి వల్ల నగరంలో 120 ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. రష్యా గతవారం భారీ బాంబర్ విమానాలను మళ్లీ రంగంలోకి దించినట్లు బ్రిటన్ రక్షణ శాఖ ఇటీవల తెలిపింది.
శీతాకాలం ముంగిట్లో ఉక్రెయిన్ విద్యు త్ మౌలిక వసతులను దెబ్బతీయడమే వీటి ఉద్దేశమని పేర్కొంది. తాజా క్షిపణి దాడులు జరిగిన సమయంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ .. కీవ్‌లో లేరు. అర్జెంటీనా నూతన అధ్యక్షుడు జేవియర్ మిలెయ్ ప్రమాణస్వీ కారానికి వెళ్లారు. మరోవైపు సోమవారం ఉక్రెయిన్‌లోని పలు ప్రాంతాలపైకి రష్యా 18 డ్రోన్లను ప్రయోగించింది. వీటిని ఉక్రెయిన్ వాయుసేన కూల్చేసింది. రష్యా నౌకాదళంలోకి సరికొత్త అణు జలాంతర్గాములు బొరెయ్ తరగతికి చెందిన అణు జలాంతర్గాములు ఎంపరర్ అలెగ్జాం డర్-3, క్రాస్నో యార్స్క్ లు సోమవారం రష్యా నౌకాదళంలో చేరాయి. సెవెరోద్విన్స్క్ లోని సెవర్మాష్ నౌకానిర్మా ణ కేంద్రంలో జరిగిన ఈ కార్యక్రమంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా పాల్గొన్నారు. ఉక్రెయిన్ అంశంలో అమెరికా, ఇతర నాటో దేశాలతో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ జలాంతర్గాములు.. రష్యా నౌకాదళ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేయనున్నాయి.