Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అన్నాడు కార్ల్ మార్క్స్. అన్ని సందర్బాల్లో కాకపోయినా..కొన్నిసార్లు ఈ మాట నిజమే అనిపిస్తుంది. ఆర్థిక ఇబ్బందులు మనిషిలో విచక్షణను నశింపచేస్తాయనడంలో ఎలాంటి సందేహంలేదు. కుటుంబమంతా సామూహిక ఆత్మహత్య చేసుకునే ఘటనలకు ప్రధానకారణం డబ్బు సమస్యలే. ప్రాణప్రదంగా ప్రేమించే పిల్లల ప్రాణాలు తీయడానికి సైతం పెద్దలు వెనకాడనది..డబ్బు లేకుండా బతకలేరన్న వేదనతోనే. ఆర్థిక సమస్యలను ఎదుర్కోలేక కొందరు బలవన్మరణాలను ఆశ్రయిస్తుంటే..మరికొందరు హంతకులుగా మారుతున్నారు. మామూలు నేరస్తుల సంగతి పక్కనపెడితే..అప్పటిదాకా సాధారణ జీవితం గడిపేవారు కూడా ఆర్థిక ఇబ్బందులను తట్టుకునే క్రమంలో క్రిమినల్ మైండ్ తో ఆలోచించి..నేరస్తులుగా మారుతున్నారు.
ఈ క్రమంలో మానవసంబధాల ఉనికిని ప్రశ్నార్థకం చేస్తున్నారు. మంగళవారం రాత్రి ఢిల్లీ రోహిణి ప్రాంతంలోని షాలిమర్ బాగ్ లో జరిగిన దారుణ ఘటనే ఇందుకు ఉదాహరణ. షాలిమర్ బాగ్ వద్ద ప్రియా మెహ్రా అనే మహిళ గుర్తుతెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో చనిపోయిన సంగతి తెలిసిందే. భర్త పంకజ్ మెహ్రా, రెండేళ్ల కుమారుడితో కలిసి ఆమె గురుద్వారాకు వెళ్లి కారులో తిరిగి వస్తుండగా..ఆమెపై కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ప్రియా మెహ్రా మృతిచెందగా…భర్త పంకజ్, కుమారుడు ప్రాణాలతో బయటపడ్డారు. తనపైకి బుల్లెట్లు దూసుకొస్తున్నా…ప్రియ తన కొడుకుకు అవి తగలకుండా…… బాబును సీటు వెనకాల దాచిపెట్టి మరణం అంచుల్లోనూ మాతృహృదయాన్ని చాటుకుంది. ఈ కాల్పుల్లో పంకజ్ కు స్వల్పగాయాలయ్యాయి. ఢిల్లీలో ఇటీవల వరుస హత్యలు జరుగుతున్న నేపథ్యంలో ప్రియ మెహ్రా హత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. రెండేళ్ల కుమారుడి కళ్లెదుట తల్లి హత్యకు గురయిన దారుణం అందరినీ కంటతడిపెట్టించింది. ఈ హత్య తరువాత ఢిల్లీలో సామాన్యుల భద్రతపై ప్రజల్లో అనేక భయాందోళనలు వ్యక్తమయ్యాయి.
దీంతో తక్షణమే రంగంలోకి దిగి కేసు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు హత్య జరిగిన తీరును పరిశీలించగానే ఓ సందేహం తలెత్తింది. కాల్పుల్లో ప్రియా మెహ్రాకే ఎక్కువ బుల్లెట్లు తగలగా, భర్త పంకజ్ మాత్రం స్వల్పగాయాలతో బయటపడ్డాడు. దీంతో అనుమానమొచ్చిన పోలీసులు పంకజ్ ను అదుపులోకి తీసుకుని విచారణ జరపగా..ఒక్క రాత్రిలోనే దారుణమైన నిజం బయటకు వచ్చింది. ప్రియా మెహ్రాను, భర్త పంకజే హత్య చేయించినట్టు దర్యాప్తులో వెల్లడయింది. రూ.40 లక్షల అప్పుకోసం పంకజ్ భార్య ప్రాణాలను పణంగా పెట్టాడు. వృత్తిరీత్యా వ్యాపారి అయిన పంకజ్ మరో వ్యాపారి నుంచి రూ. 40 లక్షల అప్పు తీసుకున్నాడు. అయితే ఆ అప్పును సకాలంలో తీర్చకుండా…తప్పించుకు తిరుగుతున్నాడు. దీంతో పంకజ్ కు అప్పు ఇచ్చిన వ్యాపారి కొంతకాలంగా అతన్ని బెదిరిస్తున్నాడు.
అప్పు తీర్చే మార్గంలేకపోవడంతో..ఎలాగైనా అతని నుంచి తప్పించుకోవాలని భావించిన పంకజ్..అతిదారుణమైన ప్లాన్ వేశాడు. భార్యను హత్యచేయించి..ఆ నేరాన్ని అప్పు ఇచ్చిన వ్యక్తిమీదకు నెట్టాలని ప్లాన్ వేశాడు. అనుకున్నట్టుగానే..కొందరు వ్యక్తులకు సుపారీ ఇచ్చి తన ప్లాన్ అమలు చేయించాడు. అయితే పోలీసులకు అనుమానం రావడంతో…పంకజ్ దారుణం వెలుగుచూసింది. రూ. 40లక్షల కోసం పంకజ్ భార్య ప్రాణాలను తీయడం చూస్తే…డబ్బు ఎంత దారుణాలు చేయిస్తుందో అర్ధమవుతుంది. పంకజ్ మెహ్రా, ప్రియా మెహ్రా ఫొటోలు చూస్తే..వారిద్దరూ అన్యోన్యంగానే జీవిస్తున్నట్టు కనిపిస్తోంది. పంకజ్ ఇలా చేస్తాడని ప్రియా కలలో కూడా ఊహించి ఉండదు. ఆమే కాదు..ఏ మహిళా తన భర్తే తనను హత్యచేయిస్తాడని ఊహించలేదు. వరకట్నం, గృహహింస వేధింపులతో జరిగే హత్యలు మన సమాజానికి కొత్త కాదు కానీ…ఇలా రోజూ ప్రేమగా కలిసి మెలిసి జీవిస్తూ..కేవలం ఆర్థిక ఇబ్బందుల నుంచి తప్పించుకోడానికి భార్యను భర్త హత్యచేయించిన ఘటనలు అంతగాలేవు. అందుకే ప్రియా మెహ్రా హత్యను సాధారణమైన నేరంగా చూడలేం. సమాజంలో మనుషుల మధ్య బలహీనమవుతున్న సంబంధాలను, కొత్త తరహా ఆర్థిక నేరాలను ఈ హత్య ప్రతిబింబిస్తోంది.