బ్రేకుల్లేకుండా దూసుకెళ్తున్న RX 100 !

RX100 Box Office collections

నిన్ననే విడుదలైన `ఆర్ .ఎక్స్.100` సినిమా పేరుకు తగ్గట్టుగానే దాని కలెక్షన్స్కూడా రయ్ రయ్ మంటూ దూసుకెళుతున్నాయి. తొలి రోజే సగం సినిమా మీద పెట్టిన వాటిలో సగం డబ్బులు వెనక్కి వచ్చేసినట్టు ట్రేడ్ వర్గాలు లెక్కలు తేల్చాయి. యూత్ ఫుల్ కంటెంట్ తో సినిమా తెరకెక్కడం ట్రైలర్లతోనే ప్రేక్షకుల్ని ఆకర్షించేయడంతో మంచి క్రేజ్ ఉన్న కథానాయకుల సినిమాల్లాగే తొలి రోజు వసూళ్లొచ్చాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలుపుకొని తొలిరోజే 1.42 కోట్ల షేర్ రాబట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. దీంతో లాంగ్ రన్ లో 15 కోట్లు వసూలు చేస్తుందని ట్రేడ్ వర్గాలవారు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా నగరాల్లో థియేటర్లు హౌస్ ఫుల్ తో కనిపించాయి. యూత్ కి కనెక్ట్ అయ్యే కంటెంట్ తో,నేటి సమాజంలో కామన్ గా జరుగుతున్న విషయం లైన్ గా తీసుకుని సినిమా నిర్మితమైంది.

ఈ సినిమా టీజర్ లోనే సినిమాలో ఎంత స్పీడ్ ఉందనే విషయం అందరికీ అర్థమైపోయింది. వీకెండ్ లోనే ఈ సినిమా లాభాల బాట పడ్డటం ఖాయమని అంటున్నారు. పోస్టర్ విడుదల నుంచి ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా ఉండటంతో, యూత్ లో ఆసక్తి పెరుగుతూ వచ్చింది. అదే ఈ స్థాయి వసూళ్లకు కారణమైందని చెప్పుకుంటున్నారు. హీరో కార్తికేయకి బాబాయ్ అయిన అశోక్ రెడ్డి నిర్మాణంలోనే `ఆర్.ఎక్స్.100` తెరకెక్కింది. చిత్రం విడుదలకి ముందే రాంకీ ఈ చిత్రాన్ని తమిళంలోకి కూడా అనువదిస్తానని చెప్పడం చూస్తుంటే ఈ సినిమాకి మరిన్ని లాభాలు తెచ్చి పెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. అలాగే ఈ చిత్రంతో అజయ్ భూపతి రూపంలో ఓ మంచి దర్శకుడు – పాయల్ రాజ్ పుత్ రూపంలో ఓ హాట్ భామ వెలుగులోకి వచ్చినట్టైంది.