Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రేయాన్ ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థి ప్రద్యుమ్న హత్యకు గల అసలు కారణాలు తెలియరావడం లేదు. 11వ తరగతి విద్యార్థి ఈ హత్య చేసినట్టు కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారుల విచారణలో తేలినప్పటికీ.. ఏ కారణంతో హత్య చేశాడన్నదానిపై స్పష్టత రావడం లేదు. పరీక్షలు, పేరెంట్స్ మీటింగ్ వాయిదా పడేలా చేసేందుకే ఆ విద్యార్థి ప్రద్యుమ్నను చంపివేశాడని అధికారులు భావిస్తున్నారు. అయితే నిందితుడు మాత్రం విచారణలో పొంతనలేని సమాధానాలు ఇస్తున్నట్టు తెలుస్తోంది.
ప్రద్యుమ్నతో ముఖ్యమైన విషయం చెప్పి తరగతి గదిలోకి తీసుకెళ్లానని, అయితే తనకు ఏం చేయాలో అర్ధం కాక, ఆ తర్వాత కొద్ది క్షణాల్లోనే గొంతుకోసేశానని ఆ విద్యార్థి విచారణలో చెప్పినట్టు సమాచారం. ప్రద్యుమ్న హత్య జరిగిన రోజు రేయాన్ పాఠశాలలోఆ చిన్నారి కాకపోయినా… ఎవరో ఒకరు కచ్చితంగా చనిపోయేవారని, నిందితుడు ఎవరో ఒకరిని చంపాలని కత్తితో పాఠశాలకు వచ్చాడని సీబీఐ అధికారులు తెలిపారు. దురదృష్టవశాత్తూ ప్రద్యుమ్న అక్కడే ఉండడంతో బలైపోయాడన్నారు.
మరోవైపు ఈ కేసులో ఇప్పటిదాకా ప్రధాన నిందితుడిగా ఉన్న బస్సు కండక్టర్ అశోక్ కుమార్ కు ఇప్పుడే క్లీన్ చిట్ ఇవ్వలేమని సీబీఐ తెలిపింది. అటు తమ కుమారుణ్ని చంపివేసిన విద్యార్థిని ఉరితీయాలని ప్రద్యుమ్న తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. తన కొడుకును ఎందుకు చంపాల్సివచ్చిందో నిందితుణ్ని అడగాలని ఉందని ప్రద్యుమ్న తల్లి కన్నీరు మున్నీరుగా విలపిస్తూ చెప్పారు.