తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

ఇంటర్‌ ఫస్టియర్‌ ఫలితాలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవలే ప్రకటించిన ఇంటర్‌ ఫస్టియర్‌ ఫలితాల్లో ఫెయిలయిన విద్యార్థులను పాస్‌ చేస్తున్నట్లు తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఇంటర్‌ ఫస్టియర్‌ ఫలితాలపై శుక్రవారం నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఆమె మాట్లాడారు. ఫస్టియర్‌లో ఫెయిలయిన విద్యార్థులందరిని కనీస శాతం మార్కులతో పాస్‌ చేస్తున్నట్లు తెలిపారు. అందరిని పాస్‌ చేయడం ఇదే చివరిసారని.. భవిష్యత్తులో ఇలాంటి నిర్ణయాలు ఉండబోవని పేర్కొన్నారు.

ప్రెస్‌మీట్‌లో సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. ”కోవిడ్‌తో విద్యావ్యవస్థ ఇబ్బందులు ఎదుర్కొంది. కోవిడ్‌ సంక్షభం కారణంగా మూడో తరగతి నుంచి పీజీ వరకు ఆన్‌లైన్‌ క్లాసులు నిర్వహించాం. విద్యార్థుల భవిష్యత్తు కోసమే ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షలు నిర్వహించాం. అన్ని అంశాలు ఆలోచించిన తర్వాతే పరీక్షలు పెట్టాం. తాజాగా ప్రకటించిన ఇంటర్‌ ఫస్టియర్‌ ఫలితాల్లో 49 శాతం మంది విద్యార్థులు పాసవ్వగా..మిగిలిన 51 శాతం మంది ఫెయిలయ్యారు. అయితే ఫెయిలయిన వారిలో ఎక్కువగా ప్రభుత్వ ఇంటర్మీడియట్‌ కళాశాలలో చదివిన విద్యార్థులే ఉన్నారు. ఫస్టియర్‌ ఫలితాలపై ప్రభుత్వాన్ని, సీఎంను టార్గెట్‌ చేయడం సరికాదు. ప్రతీదీ రాజకీయం చేయడం ప్రతిపక్షాలకు అలవాటైపోయింది.

ఫలితాలపై ఇంటర్‌ బోర్డులో ఎలాంటి లోపాలు జరగలేదు. వాల్యుయేషన్‌ పకడ్బందీగా నిర్వహించారు. విద్యార్థుల తల్లిదండ్రులు, విపక్షాలు బాధ్యతగా వ్యవహరిస్తే మంచిది. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు ఫెయిలయిన విద్యార్థులందరికి కనీస 35 మార్కులు ఇచ్చి పాస్‌ చేస్తున్నాం. ఇంటర్ సెకండ్‌ ఇయర్‌లోనైనా విద్యార్థులు కష్టపడి చదివి మంచి మార్కులు సాధించాలని కోరుకుంటున్నా. ఇలాగే ఆందోళనలు చేస్తే ఇంటర్‌ సెకండియర్‌లో కూడా ప్రభుత్వమే పాస్‌ చేస్తుందని ఆశించడం మంచి పద్దతి కాదు” అని మంత్రి సబితా విజ్ఞప్తి చేశారు. ” అంటూ తెలిపారు.