టీమిండియా ఓటమికి వారే కారణం

టీమిండియా ఓటమికి వారే కారణం

డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా ఓటమికి గల కారణాలను క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ విశ్లేషించాడు. ప్రపంచపు తొలి టెస్ట్‌ ఛాంపియన్‌గా అవతరించిన న్యూజిలాండ్‌కు శుభాకాంక్షలు తెలుపుతూనే.. కోహ్లీ సేన ఓటమికి గల కారణాన్ని తెలియజేశాడు. రిజర్వ్‌ డే ఆటలో 10 బంతుల వ్యవధిలోనే కెప్టెన్ కోహ్లీ, పుజారాల వికెట్లు కోల్పోవడం భారత ఓటమికి ప్రధాన కారణమని ట్విటర్ వేదికగా అభిప్రాయపడ్డాడు. ఆ ఇద్దరు బాధ్యతాయుతంగా ఆడి ఉంటే భారత్‌ కనీసం డ్రాతోనైనా గట్టెక్కేదని, టీమిండియా ఓటమికి వారిద్దరే పరోక్షంగా కారకులయ్యారని తెలిపాడు. చివరి రోజు తొలి 10 ఓవర్ల ఆట చాలా కీలకమని తాను చెప్పిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించాడు.

10 బంతుల వ్యవధిలో కోహ్లీ, పుజారాల వికెట్లు కోల్పోవడంతో భారత జట్టు తీవ్ర ఒత్తిడికి లోనైందని సచిన్ ట్వీట్ చేశాడు. కాగా, ఓవర్‌నైట్‌ స్కోరు 64/2తో రిజర్వ్‌ డే ఆట కొనసాగించిన భారత్‌.. రెండో ఇన్నింగ్స్‌లో 170 పరుగులకే ఆలౌటైంది. రిషబ్‌ పంత్‌ (41) టాప్‌ స్కోరర్‌గా నిలవగా, సౌతీ 4 వికెట్లతో టీమిండియాను దెబ్బ కొట్టాడు. అనంతరం 139 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన న్యూజిలాండ్‌.. 45.5 ఓవర్లలో 2 వికెట్లక నష్టానికి 140 పరుగులు చేసి, టెస్ట్‌ ఫార్యాట్‌లో జగజ్జేతగా ఆవిర్భవించింది. ఈ నేపథ్యంలో విలియమ్సన్‌ సారధ్యంలోని బ్లాక్‌ క్యాప్స్‌పై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తుండగా, టీమిండియాపై మాత్రం విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.