సచిన్‌తో తన తొలి పరిచయం

సచిన్‌తో తన తొలి పరిచయం

క్రికెట్‌ దిగ్గజం, మాస్టర్ బ్లాస్టర్ సచిన్‌ టెండూల్కర్‌ను తొలిసారి చూసిన మధుర క్షణాలను అతని సతీమణి అంజలి గుర్తు చేసుకున్నారు. 1990 ఇంగ్లండ్ పర్యటన అనంతరం స్వదేశానికి తిరిగి వచ్చిన సచిన్‌ను మొదటిసారిగా ముంబై ఎయిర్​పోర్ట్‌లో చూశానని, అప్పటికీ సచిన్ ఎవరో తనకు తెలీదని, క్యూట్‌గా ఉండడం వల్ల అతని వెంట పడ్డానని అంజలీ వెల్లడించారు. అప్పుటికి సచిన్‌ వయసు 17 ఏళ్లని, అయినా తనకి 12 ఏళ్ల పిల్లాడిలా కనిపించాడని ఆమె తెలిపారు. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూ సందర్భంగా సచిన్‌తో తన తొలి పరిచయానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను అంజలీ వెల్లడించారు.

సచిన్‌ను తొలిసారి ఎయిర్​పోర్ట్‌లో చూసినప్పుడు నా ఫ్రెండ్​అపర్ణ నాతో ఉందని, తనే నాకు సచిన్‌ గురించి చెప్పిందని అంజలీ గుర్తు చేసుకున్నారు. క్రికెట్లో సచిన్‌ ఒక అద్భుతమని.. అతి చిన్న వయసులో సెంచరీ చేసి చరిత్ర సృష్టించిన ఆటగాడని అపర్ణ తనతో తెలిపిందన్నారు. అప్పట్లో క్రికెట్ పట్ల తనకు పెద్దగా ఆసక్తి ఉండేది కాదని, అందుకే అతడెవరైతే నాకేంటని అనుకున్నానని ఆమె నవ్వుతూ చెప్పారు. అయితే సచిన్‌ క్యూట్‌నెస్‌ని చూసి తాను ఫిదా అయ్యానని, అందుకే అతని వెంట పరుగెత్తానని అలనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఆ సందర్భంలో నేను వెంటపడుతున్నానని తెలిసి సచిన్‌ చాలా ఇబ్బంది పడ్డాడని, కనీసం నా వైపు చూసే సాహసం​కూడా చేయలేకపోయాడని చెప్పుకొచ్చారు.

కాగా, 1995లో సచిన్,​అంజలి వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వీరికి సారా, అర్జున్​అనే ఇద్దరు పిల్లలున్నారు. సచిన్ సతీమణి అంజలి వృత్తిరిత్యా డాక్టర్. ఆమె సచిన్ కంటే 5 ఏళ్లు పెద్దవారు. ప్రస్తుతం సచిన్ వయసు 48 కాగా.. అంజలికి 53. ఇదిలా ఉంటే, 1989 నుంచి 24 ఏళ్ల పాటు క్రికెట్‌ కెరీర్‌ను కొనసాగించిన సచిన్.. అంతర్జాతీయ క్రికెట్‌లో 100 శతకాలు నమోదు చేసిన ఏకైక బ్యాట్స్‌మెన్‌గా రికార్డ్ నెలకొల్పాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఇప్పటివరకు ఎవరికీ సాధ్యంకాని మరెన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు.