సచిన్ బర్త్ డే బాదుడు…. చిరస్మరణీయం..

మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పుట్టినరోజు నేడు. 24 ఏళ్ల పాటు క్రికెట్ ఆడిన సచిన్ టెండూల్కర్ ఎన్నో చిరస్మరణీయమైన ఇన్నింగ్స్‌ లలో చెలరేగిపోయాడు. సరిగ్గా తన పుట్టిన రోజు నాడే ఆస్ట్రేలియాపై షార్జాలో అతను సాధించిన శతకం.. జట్టుని గెలిపించిన తీరు భారత క్రికెట్‌లో శాశ్వతంగా నిలిచిపోయింది. కోకాకోలా కప్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో ఏప్రిల్ 24, 1998లో షార్జా వేదికగా జరిగిన ఆ ఫైనల్ మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగినపోయారు సచిన్ టెండూల్కర్. ఒంటిచేత్తో టీమిండియాని గెలిపించాడు. అప్పట్లో ఎడారిలో సచిన్ తుపాన్ అంటూ క్రికెట్ విశ్లేషకులు సచిన్‌ ఇన్నింగ్స్‌ని అభివర్ణించి సముచితంగా గౌరవించారు.

అయితే ఆ మ్యాచ్‌లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 272 పరుగులు చేసింది. అప్పటి ఆసీస్ కెప్టెన్ స్టీవ్‌వా 70, లెహ్మాన్ 70, హాఫ్ సెంచరీలు నమోదు చేయగా.. ఆ రోజుల్లో 272 స్కోర్ సేఫ్ అనే టాక్ ఉండేది. కానీ.. సచిన్ టెండూల్కర్ ఇక్కడ అనేది మర్చిపోయారు అంతా. ఏకంగా (134: 131 బంతుల్లో 12×4, 3×6) అసాధారణ శతకంతో ఆస్ట్రేలియా బౌలర్లని చమటలు పట్టించాడు. ముఖ్యంగా షేన్‌వార్న్‌ని టార్గెట్‌ చేసి అతని తలమీదుగా బౌండరీలు బాదిన సచిన్.. ఓ రెండు సిక్సర్లు స్టాండ్స్‌లో పడేలా కుమ్మేశారు. అలాగే ఓపెనర్‌గా ఆడిన సచిన్ టెండూల్కర్.. సౌరవ్ గంగూలీ (23), నయాన్ మోంగియా (28) నిరాశపరిచినా.. పట్టుదలగా క్రీజులో నిలవడం విశేషం. అతడిని నిలువరించేందుకు దిగ్గజ స్పిన్నర్ షేన్‌వార్న్‌ని పదే పదే కెప్టెన్ స్టీవ్‌వా ప్రయోగించగా.. స్వీప్ షాట్స్‌‌తో పాటు క్రీజు వెలుపలికి వచ్చి మరీ సచిన్ భారీ షాట్లు దిశగా బాదేశాడు. కాగా సచిన్ దెబ్బకి షేన్‌వార్న్ 10 ఓవర్లలో వికెట్ లేకుండా 61 పరుగులను తమ ఖాతాలో వేసుకొని చరిత్ర సృష్టించాడు. సచిన్ 248 పరుగుల వద్ద ఔటవగా.. భారత్ టీం మరో 9 బంతులు మిగిలి ఉండగానే 275/4 విజయానికి చేరుకుంది.