దేవీప్రియ‌కు కేంద్ర‌సాహిత్య అకాడ‌మీ పుర‌స్కారం

sahitya academy award to devipriya

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

ప్ర‌ముఖ ర‌చ‌యిత దేవీప్రియ‌ను కేంద్ర సాహిత్య అకాడ‌మీ అవార్డు వ‌రించింది. ఆయ‌న ర‌చించిన గాలిరంగు క‌వితా సంపుటికి ఈ ప్ర‌తిష్టాత్మ‌క అవార్డు ద‌క్కింది. అదేవిధంగా అనువాద విభాగంలో వీణావ‌ల్ల‌భ‌రావుకు విరామ‌మెరుగ‌ని ప‌య‌నం పుస్త‌కానికి కేంద్ర‌సాహిత్య అకాడ‌మీ అవార్డు ల‌భించింది. పంజాబీ భాష‌లోని ఖానా బ‌దోష్ ఆత్మ‌క‌థ‌ను తెలుగులోకి వ‌ల్ల‌భ‌రావు అనువ‌దించారు. దేవీప్రియ త‌న క‌విత్వంతో తెలుగు సాహిత్యాభివృద్ధికి విశేష కృషి చేస్తున్నారు. అదేస‌య‌యంలో జ‌ర్న‌లిస్టుగానూ సేవచేస్తున్నారు. క‌విగా, పాత్రికేయుడిగా, సంపాద‌కుడిగా, సినీ గేయ ర‌చ‌యిత‌గా, డాక్యుమెంట‌రీ రూప‌క‌ర్త‌గా, టీవీ చాన‌ల్ కంటెంట్ విభాగాధిప‌తిగా అనేక రంగాల్లో త‌న ప్ర‌తిభ చాటారు దేవీప్రియ‌.

దైనందిన రాజ‌కీయ,సాంఘిక ప‌రిస్థితుల్ని ప్ర‌తిబింబిస్తూ ఆయ‌న చేసే ర‌న్నింగ్ కామెంట‌రీ విశేష ఆద‌ర‌ణ పొందింది. ఇప్ప‌టిదాకా ఆయ‌న ప‌న్నెండుకు పైగా పుస్త‌కాలు వెలువ‌రించారు. ప్ర‌జాగాయ‌కుడు గద్ద‌ర్ పైనా డాక్యుమెంట‌రీ నిర్మించారు. అమ్మ‌చెట్టు, గ‌రీబుగీతాలు, నీటిపుట్ట‌, అర‌ణ్య‌పురాణం వంటి ర‌చ‌న‌లు చేశారు. దేవీప్రియ అసలు పేరు షేక్ ఖాజాహుస్సేన్. 1949 ఆగ‌స్టు 15న గుంటూరులో జ‌న్మించారు. గుంటూరులోని ఏసీ కాలేజీలో బీఏ చ‌దువుకుంటున్న రోజుల్లో క‌విత్వం ప‌ట్ల ఆక‌ర్షితులై ప‌ద్యాలు, గేయాలు రాయ‌డం ప్రారంభించారు. గుంటూరు కేంద్రంగా అవ‌త‌రించిన పైగంబ‌ర క‌వులు బృందంలో దేవీప్రియ ఒక‌రు.