ఆవేదన వ్యక్తం చేసిన సాయి పల్లవి

ఆవేదన వ్యక్తం చేసిన సాయి పల్లవి

ఓ వైపు తూత్తుకుడి జిల్లాలో తండ్రి కోడుకుల జయరాజ్‌, బెనిక్స్‌ కస్టోడియల్‌ మరణాల పట్ల నిరసనలు కొనసాగుతుండగానే పుదుకొట్టాయ్‌లో మరో దారుణం చోటు చేసుకుంది. ఏడేళ్ల చిన్నారిపై మృగాళ్లు పైశాచికంగా దాడి చేసి చంపేసిన ఘటన పట్ల ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తం అవుతోంది. రెండు రోజుల క్రితం తప్పిపోయిన బాలిక అత్యాచారానికి గురయ్యి దారుణంగా హత్యగావింపడింది. ప్రస్తుతం సోషల్‌ మీడియా వేదికగా సెలబ్రెటీలు, నెటిజనులు ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీరిలో నటి సాయి పల్లవి కూడా ఉన్నారు.

‘బలహీనులకు సాయం చేయడానికి ఇచ్చిన శక్తిని మేము దుర్వినియోగం చేస్తూ బలహీనులను బాధపెడతాము. మా రాక్షసానందం కోసం చిన్నారులను బలి తీసుకుంటాము. ఈ ఘటనలతో మానవజాతిపై ఆశ అత్యంత వేగంగా దిగజారుతోంది. గడుస్తున్న ప్రతి రోజు ప్రకృతి మనకో విషయం చెప్తుంది. మన జాతి శుభ్రంగా తుడిచి పెట్టుకోవాల్సిన అవసరం ఉన్నట్లు గుర్తు చేస్తోంది.

ఈ అన్యాయాలు చూడటానికే మనం ఇంత దారుణమైన జీవితాన్ని గడుపుతున్నాం. పనికిరాని జీవితం. చిన్నారులను కాపాడలేకపోతున్నాం.. కనుక మరో బిడ్డను ఈ రాక్షసలోకంలోకి తీసుకు వచ్చే అర్హత కోల్పోయాం. ఓ దారుణం గురించి సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అయినప్పుడు లేదా మీడియాలో ప్రచారం జరిగినప్పుడు మాత్రమే న్యాయం జరిగే రోజు రాకూడదని కోరుకుంటున్నాను. మరి మనం గమనించని, పట్టించుకోని నేరాల విషయంలో ఏం చేద్దాం’ అంటూ సాయి పల్లవి వరుస ట్వీట్లు చేస్తూ ఆవేదన వ్యక్తం చేశారు.