థామస్ కప్, ఆసియా క్రీడలు, కామన్వెల్త్ గేమ్స్‌లో పాల్గొనే భారత జట్ల ఎంపిక కోసం నిర్వహిస్తున్న ట్రయల్స్‌లో భారత స్టార్ షట్లర్ సాయిప్రణీత్ విఫలమయ్యాడు. భారత బ్యాడ్మింటన్ సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ట్రయల్స్ టోర్నీలో హైదరాబాద్ ప్లేయర్ సాయిప్రణీత్ 2ఎ గ్రూప్‌లో రెండో స్థానంలో నిలిచాడు. నలుగురు చొప్పున ఉన్న నాలుగు గ్రూప్‌ల నుంచి ‘టాప్’లో నిలిచిన నలుగురే తదుపరి ట్రయల్స్ దశకు అర్హత పొందుతారు.
2ఎ గ్రూప్‌లో కిరణ్ జార్జి అగ్రస్థానంలో నిలిచి తదుపరి దశకు అర్హత పొందగా… సాయిప్రణీత్ రెండో స్థానంలో నిలిచాడు. కిరణ్ జార్జితో జరిగిన కీలక మ్యాచ్‌లో ప్రపంచ 19వ ర్యాంకర్, 2019 ప్రపంచ చాంపియన్‌షిప్ కాంస్య పతక విజేత సాయిప్రణీత్ 21–23, 21–11, 16–21తో ఓడిపోయాడు. ప్రపంచ ర్యాంకింగ్స్ ఆధారంగా సింగిల్స్ కోసం లక్ష్య సేన్, శ్రీకాంత్… ఇటీవల కనబరిచిన ప్రదర్శన ఆధారంగా ప్రణయ్‌ను ‘బాయ్’ నేరుగా భారత జట్టులోకి ఎంపిక చేసింది. మిగిలిన ఒక బెర్త్ కోసం కిరణ్ జార్జి, రవి, సమీర్ వర్మ, ప్రియాన్షు తలపడతారు.