బెల్లంకొండ ‘స్వాతిముత్యం’ను రక్తి కట్టించగలడా?

Sai Srinivas To Make Swathi Muthyam Movie

‘అల్లుడు శీను’ చిత్రంతో హీరోగా పరిచయం అయిన బెల్లంకొండ శ్రీనివాస్‌ ఆ తర్వాత వరుసగా చిత్రాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. ఈయన చేసిన చిత్రాలు మినిమం గ్యారెంటీ సక్సెస్‌లుగా నిలుస్తున్నాయి. ఈయన గత చిత్రం ‘జయ జానకి నాయక’ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. త్వరలోనే ‘సాక్ష్యం’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న బెల్లంకొండ ఇప్పటికే మరో సినిమాను చేస్తున్నాడు. ఈ రెండు చిత్రాలు కాకుండా మరో సినిమాను బెల్లంకొండ శ్రీనివాస్‌ చేసేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు. తాజాగా ఒప్పుకున్న చిత్రంలో బెల్లంకొండ చాలా విభిన్నమైన పాత్రలో కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. పల్లెటూరు అమాయకపు కుర్రాడిగా కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది.

బెల్లంకొండ శ్రీనివాస్‌ చేయబోతున్న చిత్రంలో కాస్త అటు ఇటుగా స్వాతిముత్యంలోని కమల్‌ హాసన్‌ పాత్ర టైప్‌లో ఉంటుందని, అమాయకపు పల్లెటూరు కుర్రాడు ప్రేమలో పడతాడు, అతడి ప్రేమను ఎలా దక్కించుకుంటాడు, అమాయకుడు కాస్త గడుసు కుర్రాడిగా ఎలా మారుతాడు అనేది సినిమా స్టోరీ లైన్‌ అంటూ సమాచారం అందుతుంది. భారీ అంచనాల నడుమ రూపొందబోతున్న ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెళ్లడి కాబోతున్నాయి. ఈయన గత చిత్రాల మాదిరిగానే ఈ చిత్రంలో కూడా ఒక స్టార్‌ హీరోయిన్‌ నటించబోతుంది. ఆ స్టార్‌ హీరోయిన్‌ ఎవరు అనే విషయం మరికొన్ని రోజుల్లో తేలిపోనుంది. వరుసగా చిత్రాలు చేసుకుంటూ వస్తున్న బెల్లంకొండ తాజాగా ఇలా ప్రయోగాత్మక చిత్రాలు చేస్తుండటం అందరికి ఆశ్చర్యంను కలిగిస్తుంది. ఇలాంటి పాత్రలు చేసేందుకు స్టార్స్‌ కూడా కాస్త జంకుతారు. కాని బెల్లంకొండ మాత్రం ప్రయోగాన్ని నెత్తికి ఎత్తుకుని తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు.