బెల్లంకొండ స్టార్‌ హీరో అనిపించుకున్నాడు!

Bellamkonda Srinivas In Star Heros List

అల్లుడు శీను’ చిత్రంతో హీరోగా బెల్లంకొండ శ్రీనివాస్‌ పరిచయం అయిన విషయం తెల్సిందే. మొదటి చిత్రంతో చాలా రిచ్‌గా ప్రేక్షకులకు పరిచయం అయిన బెల్లంకొండ శ్రీనివాస్‌ తన ప్రతి సినిమాను కూడా భారీ బడ్జెట్‌తో చేస్తూ వస్తున్నాడు. వరుసగా భారీ బడ్జెట్‌ చిత్రాలు చేస్తూ, మంచి విజయాలను అందుకుంటూ, భారీ వసూళ్లను రాబడుతూ వచ్చిన బెల్లంకొండ శ్రీనివాస్‌ స్టార్‌ హీరోల జాబితాలో చేరిపోయాడు. మహేష్‌, ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌, అల్లు అర్జున్‌ వంటి స్టార్‌ హీరోలు మాత్రం 40 కోట్లు ఆపై బడ్జెట్‌తో సినిమాలు చేస్తున్నారు. చిన్న హీరోలు 20 కోట్ల లోపు బడ్జెట్‌లోనే ఉండి పోయారు. కొంత మంది ఇండస్ట్రీకి వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా కూడా 10 కోట్లను దాటడంలేదు. ఇలాంటి సమయంలో మూడు నాలుగు సినిమాలకే వరుసగా 40 కోట్ల వసూళ్లను సాధించిన బెల్లంకొండ శ్రీనివాస్‌ స్టార్‌ హీరోల జాబితాలో చోటు దక్కించుకున్నాడు.

బెల్లంకొండ తాజాగా ‘సాక్ష్యం’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దాదాపు 40 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించడం జరిగింది. ఏమాత్రం క్రేజ్‌ లేని దర్శకుడు శ్రీవాస్‌ ఈ చిత్రాన్ని చేసినా కూడా బెల్లంకొండపై ఉన్న నమ్మకంతో ప్రేక్షకులు ఈ చిత్రానికి భారీ ఓపెనింగ్స్‌ను ఇచ్చారు. మొదటి రోజే ఈ చిత్రం 3 కోట్ల షేర్‌ దక్కింది. మొదటి మూడు రోజుల్లో దాదాపుగా 8 కోట్లకు పైగా వసూళ్లు వచ్చినట్లుగా సమాచారం అందుతుంది. ఇక ఈ చిత్రం శాటిలైట్‌ రైట్స్‌ భారీ ఎత్తున జరిగింది. స్టార్‌ హీరోల సినిమా రేంజ్‌లో ఈ చిత్రం శాటిలైట్‌ రైట్స్‌ ఏకంగా 13 కోట్లకు అమ్ముడు పోయినట్లుగా తెలుస్తోంది. తెలుగు శాటిలైట్‌ రైట్స్‌కు 8 కోట్లు కాగా, హిందీ శాటిలైట్‌ రైట్స్‌ ద్వారా మరో 5 కోట్ల వరకు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇతర భాషల డబ్బింగ్‌ శాటిలైట్‌ రైట్స్‌ను ఇంకా అమ్మలేదని తెలుస్తోంది. మొత్తంగా కలెక్షన్స్‌ మరియు శాటిలైట్‌ రైట్స్‌ను చూస్తుంటే బెల్లంకొండ స్టార్‌ హీరో అనిపించుకున్నట్లే అని చెప్పడంలో సందేహం లేదు.