కరోనా తీవ్రత ఇంకా తగ్గని ప్రస్తుత స్థితిలో ప్రతిష్టాత్మక ‘థామస్, ఉబెర్ కప్ ఫైనల్స్’ టోర్నీ నిర్వహణపై భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ ఆందోళన వ్యక్తం చేసింది. వైరస్ వ్యాప్తి కొనసాగుతోన్న ఈ సమయంలో టోర్నీ నిర్వహణ సురక్షితమేనా అని ఆమె ప్రశ్నించింది. ‘మహమ్మారికి భయపడి ఏడు దేశాలు టోర్నీ నుంచి నిష్క్రమించాయి. ఈ సమయంలో టోర్నీ నిర్వహించడం సబబేనా?’ అని సైనా ట్వీట్ చేసింది.
అక్టోబర్ 3నుంచి 11వరకు థామస్, ఉబెర్ కప్ జరుగనుంది. మార్చిలో ఆగిపోయిన అంతర్జాతీయ బ్యాడ్మింటన్ పోటీలు మళ్లీ ఈ టోర్నీతోనే ప్రారంభం కానున్నాయి. అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌ను పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తోన్న ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య ఆటగాళ్లకు క్వారంటీన్ వెసులుబాటు కూడా కల్పించింది. టోర్నీ కోసం డెన్మార్క్ చేరుకునే ఆటగాళ్లు ‘నెగెటివ్’గా తేలితే తప్పనిసరిగా క్వారంటీన్‌లో ఉండాల్సిన అవసరం లేదని బీడబ్ల్యూఎఫ్ ప్రకటించింది. ఇప్పటికే ఈ టోర్నీలో పాల్గొనే భారత పురుషుల, మహిళల జట్లను ‘బాయ్’ ప్రకటించింది.