ఈనాడుని దాటేసిన సాక్షి… కానీ!

Sakshi Online paper Alexa Rank Better than Eenadu online Paper

తెలుగు పత్రికారంగంలో నెలకొన్న పోటీ రాజకీయ పోరాటాలకు ఏ మాత్రం తక్కువ కాదు. మరీ ముఖ్యంగా ఈనాడు, సాక్షి మధ్య ఒకప్పుడు జరిగిన పోరాటం తెలుగు ప్రజలకు సురపరిచితమే. అయితే 2014 ఎన్నికల్లో వైసీపీ ఓటమి తర్వాత మిగిలిన మీడియా తో కూడా స్నేహంతో వ్యవహరించాలని ఆ పార్టీ అధినేత జగన్ నిర్ణయించుకున్నారు. ఆపై కొన్నాళ్ళకు ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు తో భేటీ అయ్యి ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. ఆ తరువాత ఆ పత్రికల ముఖాముఖీ పోరాటం తగ్గుమొహం పట్టింది. అయితే రాజకీయ అభిప్రాయాలు, విధానపరమైన వైఖరిలో మాత్రం ఏ మార్పులు కనిపించలేదు. దాన్ని బట్టి లోలోన పోటీ భావన అలాగే మిగిలిపోయింది. ఇక జగన్ ఏర్పాటు చేసిన వైసీపీ కేవలం ఆంధ్రప్రదేశ్ కి మాత్రమే పరిమితం కావడంతో తెలంగాణాలో సాక్షి పత్రిక మీద ఆ ప్రభావం పడింది. ఈ పరిస్థితుల్లో ఈనాడుని అధిగమించడం అంటే చాలా కష్టం అని అనుకుంటున్న తరుణంలో సాక్షి కి వెబ్ మీడియా రూపంలో అనూహ్యమైన అవకాశం దొరికింది. 44 ఏళ్ళ కిందట ఏర్పాటు అయిన ఈనాడు కి వెబ్ మీడియా రంగంలోకి వచ్చాక ఇంకోసారి వెనుకబడింది.

పత్రికలకు ఏబీసీ లెక్కలు ఎంత కొలమానం అని భావిస్తారో, వెబ్ సైట్ ర్యాంకుల విషయంలో ఆలెక్స ని ప్రామాణికంగా భావిస్తారు. మొన్నామధ్య ఈ ర్యాంకుల రేసులో ఈనాడు.నెట్ ని అధిగమించిన ఆంధ్రజ్యోతి అక్కడ తన స్థానాన్ని స్థిరపరుచుకుంది. ఈ మధ్య సాక్షి వెబ్ సైట్ కూడా ఈనాడు వెబ్ సైట్ ని అలెక్స రాంక్ పరంగా దాటేసింది. అయితే ఈ రెంటి కన్నా రేసులో ఆంధ్రజ్యోతి వెబ్ సైట్ ముందుంది. తాజా లెక్కలప్రకారం అలెక్స లో ఆంధ్రజ్యోతి ఇండియన్ ర్యాంక్ 109, ఇంటర్నేషనల్ ర్యాంక్ 1140 కాగా, సాక్షి .కామ్ ఇండియన్ ర్యాంక్ 113, ఇంటర్నేషనల్ ర్యాంక్ 1268 , ఇక ఈనాడు.నెట్ ఇండియన్ ర్యాంక్ 122, ఇంటర్నేషనల్ ర్యాంక్ 1420. అయితే దాదాపుగా ఈ ర్యాంకులు రోజువారీగా మారిపోతాయి. కానీ చిరకాల ప్రత్యర్థి మీద దక్కిన ఈ విజయాన్ని సాక్షి బాగా ఎంజాయ్ చేస్తోందట.