సలార్.. సలార్.. సలార్.. ఇప్పుడు నెట్టింట చర్చ మొత్తం ఈ మూవీ గురించే. అసలు ఈ సినిమా ఇప్పట్లో విడుదలవుతుందా అని ప్రేక్షకులు అనుమానిస్తున్నారు. ఎందుకంటే తరచూ రిలీజ్ డేట్లలో మార్పులు చేయడంతో సలార్ ఫ్యాన్స్‌కు నిరాశ తప్పడం లేదు. అయితే సలార్ మూవీకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ నెట్టింట బాగా వైరల్ అవుతోంది.
అదేంటంటే.. ఈ మూవీ దర్శకుడు ప్రశాంత్ నీల్ భార్య లిఖితా రెడ్డి నీల్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో పెట్టిన పోస్ట్ ఆసక్తి రేకెత్తిస్తోంది. ‘‘2023 డిసెంబరు ఎప్పటిలా ఉండదు. ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’’ అని ఆమె తన పోస్టులో రాసుకొచ్చారు. దీంతో డిసెంబరులో ‘సలార్’ రిలీజ్ ఫిక్స్ అని అంతా అనుకుంటున్నారు. అయితే, చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన ఇంకా రాలేదు.
మరోవైపు ప్రభాస్ అభిమానులు, పలు సినీ వెబ్‌సైట్లు సైతం ఆ సినిమా ‘సలార్: పార్ట్1’ డిసెంబరు 22న రిలీజ్ అవుతుంది’ అంటూ ‘ఎక్స్’ (ట్విటర్)లో పోస్ట్‌లు పెట్టాయి. కొందరు ఫ్యాన్స్ రిలీజ్ డేట్‌తో కూడిన పోస్టర్‌ని సైతం క్రియేట్ చేసి, వైరల్ కూడా చేస్తున్నారు. ప్రభాస్ హీరోగా ఈ మూవీ రెండు భాగాలుగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. శ్రుతి హాసన్ కథానాయిక. సెప్టెంబరు 28న విడుదలకావాల్సిన తొలి భాగం వాయిదా పడిన సంగతి మనకి తెలిసిందే.