సల్మాన్ ఖాన్ వయసు ఇప్పుడు 53 ఏళ్లు. అతడి పెళ్లి గురించి కొన్ని దశాబ్దాలుగా ప్రచారం జరుగుతోంది. ఇదిగో అదిగో అంటున్నారు. కానీ పెళ్లి మాత్రం కావట్లేదు. ఐశ్వర్యారాయ్, కత్రినా కైఫ్, లులియా.. ఇలా ఎప్పటికప్పుడు పేర్లు మారుతూ వచ్చాయి. కానీ ఎవరితోనూ అతడి పెళ్లి కాలేదు.
రుమేనియాకు చెందిన లులియాతో పక్కాగా పెళ్లి అంటూ కొన్నేళ్లుగా అంటున్నారు కానీ.. అది కార్యరూపం దాల్చలేదు. సల్మాన్‌కు పెళ్లి పట్ల ఎందుకింత వ్యతిరేకత.. ఇంకెప్పుడు అతను పెళ్లాడతాడు అని అభిమానులు చర్చించుకుంటూనే ఉన్నారు. అతను మాత్రం సైలెంటుగా తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు. అయితే నిజానికి 20 ఏళ్ల ముందే సల్మాన్‌కు పెళ్లి జరగాల్సిందట.
కానీ పెళ్లి నిశ్చయమయ్యాక.. కేవలం ఆ వేడుకకు ఐదు రోజుల ముందు సల్మాన్ ప్లేటు ఫిరాయించాడట. ఈ విషయాన్ని అతడి మిత్రుడు, అగ్ర నిర్మాత సాజిద్ నడియాడ్‌వాలా ఓ టీవీ షోలో వెల్లడించాడు. 1999లో సల్మాన్ కోసం ఓ అమ్మాయిని చూసి పెళ్లికి అతడి తండ్రి సలీమ్ ఖాన్ ఏర్పాట్లు చేశాడని.. పెళ్లి పత్రికలు కూడా పంచాడని.. తనకు కూడా అప్పటికే పెళ్లి నిశ్చయం కావడంతో ఇద్దరి పెళ్లి ఒకే రోజు చేయాలనుకున్నారని సాజిద్ వెల్లడించాడు.
ఐతే ఐదు రోజుల్లో పెళ్లి అనగా.. ఉన్నట్లుండి సల్మాన్ తనకు పెళ్లి చేసుకునే మూడ్ లేదంటూ మాట మార్చేశాడన్నాడు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో పెళ్లి ఆగిపోయిందని.. తన పెళ్లి మాత్రం యధావిధిగా జరగ్గా.. ఆ వేడుకకు వచ్చిన సల్మాన్.. బయట కారుంది అది వేసుకుని పారిపో అంటూ చమత్కరించాడని సాజిద్ వెల్లడించాడు.