టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ముంబైలో ఇల్లు కొనుగోలు చేయబోతుందని, త్వరలోనే ఆమె అక్కడికే మాకాం మారబోతున్నట్లు ఇటీవల జోరుగా ప్రచారం జరిగింది. అయితే దీనిపై ఇంతవరకు ఆమె స్పందించలేదు. దీంతో నిజంగానే సామ్ ముంబై వెళ్లిపోనుందా అని ఆమె అభిమానుల్లో కంగారు మొదలైంది. ఇదిలా ఉండగా సమంత ప్రారంభించిన ఆన్లైన్ ఫ్యాషన్ బ్రాండ్ ‘సాకి’ నిన్నటితో ఏడాదిని పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో ఆమె మంగళవారం సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటించింది.
ఈ మేరకు సమంత ఇన్స్టాగ్రామ్లో లైవ్ సెషన్ నిర్వహించి అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది. ఈ సందర్భంగా ‘సామ్ మీరు ముంబైకి షిప్ట్ అవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇది నిజమేనా’ అని ఓ అభిమాని ప్రశ్నించగా దీనిపై సమంత స్పందిస్తూ ఇలా చెప్పింది. ‘ఈ రూమార్స్ అన్ని ఎలా పుట్టుకొస్తున్నాయో అర్థం కావడం లేదు. ఈ మధ్య వందల కొద్ది వార్తలు బయటకు వచ్చాయి. కానీ వీటిలో ఏ మాత్రం నిజం లేదు. ఇక హైదరాబాద్ విడిచి నేను ఎక్కడికి వెళ్లను. ఈ వార్తలు ఏ విధంగా పుట్టించారో తెలియదు కానీ, అన్ని రూమార్స్ లాగే ఇది కూడా ఒకటి’ అంటూ తనదైన శైలి సమంత సమాధానం ఇచ్చింది.