జరభద్రం..శానిటైజర్ తో కల్తీ సారా..

ప్రపంచాన్ని వణికించేస్తున్న కరోనా వైరస్. దీని దెబ్బకు ప్రపంచ దేశాలన్నీ లాక్ డౌన్ తప్పక మరో మార్గం లేకుండా పోయింది. దీంతో అన్ని రంగాలు మూతబడ్డాయి. అయితే కరోనా మహమ్మారి విజృంభిస్తున్న ఈ సమయంలో కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు అన్ని ప్రభుత్వాలు నానా తంటాలు పడుతుంటే.. సందట్లో సడేమియా అన్నట్లుగా ఈ అవకాశాన్నతమకు సావకాశంగా మలుచుకుంటున్నారు కొంతమంది పెద్దమనుషులు. అదేమంటే.. ఈ సమయంలో కూడా డబ్బులు ఎలా సంపాదించాలి అనే మార్గాన్ని పట్టుకొని అక్రమాలకు పాల్పడుతున్నారు. కరోనా సోకకుండా చేతులకు రాసుకొనే శానిటైజర్ తో కొంతమంది సారా తయారు చేస్తున్నారు. ఏకంగా దొంగ సారాను తయారు చేసి.. విపణిలో అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు.

అదెలాగంటే… లాక్ డౌన్… కరోనా మహమ్మారి కారణంగా బయట ఎక్కడా కూడా మద్యం దొరకడం లేదు. ఈ సమయంలో మత్తుకు బానిసైన వ్యక్తులు కల్తీ మద్యం దొరికినా కొనుక్కొని తాగేస్తున్నారు. ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా అనంతపురం జిల్లాలో ఓ మెడికల్ రిప్రజెంటేటివ్, మరో ముగ్గురితో కలిసి శానిటైజర్ తో సారా తయారు చేసి అమ్ముతున్నాడు. ఈ విషయం తెలుసుకున్న అధికారులు, పోలీసులతో కలిసి ఓ వ్యక్తిని సారా కొనుగోలు చేసేందుకు పంపించి రెడ్ హ్యాండెడ్ గా అతడిని పట్టుకున్నారు. కాగా నిందితుల వద్ద నుంచి 18 శానిటైజర్ సీసాలను.. సారా బాటిళ్లను స్వాధీనం చేసుకున్నరు. వెంటనే అతడిని పోలీసులకు అప్పగించి అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.