కరోనా వైరస్ బారినుంచి రక్షణ కల్పించేందుకు వాడే శానిటైజర్ ఓ మహిళ ప్రాణాల మీదకు తెచ్చింది. ప్రమాదవశాత్తు శానిటైజర్ బాటిల్ పేలటంతో ఆమె శరీరం మొత్తం తీవ్రంగా కాలిపోయింది. ఈ సంఘటన అమెరికాలోని టెక్సాస్‌లో ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. టెక్సాస్‌కు చెందిన కేట్ వైడ్ గత ఆదివారం.. రోజూలానే ఆ రోజు కూడా చేతులకు శానిటైజర్ రాసుకుంది. ఆ తర్వాత కొవ్వొత్తి వెలిగిద్దామని అగ్గిపుల్ల గీసింది. అంతే ఆమె చేతికి మంటలు అంటుకున్నాయి. దీంతో భయపడ్డ ఆమె వెంటనే వెనక్కు దూకింది.
ఆ సమయంలో వెనకాల ఉన్న శానిటైజర్ బాటిల్‌ను తాకింది. ఆ వెంటనే మంటలు శానిటైజర్ బాటిల్‌ను అంటుకోవటంతో బాంబ్‌లాగా పెద్ద శబ్ధంతో పేలిందది. పెద్ద ఎత్తున ఎగిసి పడ్డ మంటలు ఆమెను చుట్టుముట్టడంతో ముఖం, చేతులు, కాళ్లపై తీవ్రంగా గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో ఇంట్లో ఉన్న కేట్ కూతుళ్లు స్థానికుల సహాయంతో ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు.