సఫారీ గడ్డపై వన్డే పోరుకు టీమిండియా సిద్ధమవుతోంది. గత పర్యటన తాలూకు ఫలితాలు పునరావృతం చేసి దక్షిణాఫ్రికాపై విజయం సాధించాలనే ప్రణాళికతో ముందుకు సాగుతోంది. ఇక రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ గాయం కారణంగా సిరీస్‌కు దూరం కావడంతో కేఎల్ రాహుల్ పగ్గాలు చేపట్టిన సంగతి తెలిసిందే. సారథిగా రాహుల్‌కు ఇదే తొలి వన్డే. మరోవైపు సుదీర్ఘ కాలం తర్వాత కెప్టెన్ అన్న ట్యాగ్ లేకుండా విరాట్ కోహ్లి బరిలోకి దిగడం ఇదే తొలిసారి. దీంతో పర్ల్ వేదికగా జరుగనున్న మొదటి వన్డే మరింత ఆసక్తికరంగా మారింది.
ఈ నేపథ్యంలో క్రీడా విశ్లేషకులు తుది జట్టు కూర్పుపై అంచనాలు వేస్తున్నారు. ముఖ్యంగా ఓపెనింగ్ జోడీ ఎవరన్న అంశంపై చర్చిస్తున్నారు. ఇక మీడియాతో మాట్లాడిన రాహుల్.. రోహిత్ గైర్హాజరీలో తాను ఓపెనింగ్ చేయడం ఖాయమని స్పష్టం చేశాడు. ఈ క్రమంలో టీమిండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్… రాహుల్‌కు జోడీగా శిఖర్ ధావన్‌ను ఎంచుకున్నాడు. అయితే, వివాదాస్పద వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ మాత్రం వెంకటేశ్ అయ్యర్‌కు అవకాశం ఇచ్చాడు. జట్టులో ఆరుగురు బౌలర్లు ఉంటే బాగుంటుందని సూచించాడు.
ఈఎస్‌పీఎన్‌క్రిక్‌ఇన్ఫోతో మాట్లాడిన అతడు… ‘‘శిఖర్ ధావన్‌కు ఈ మ్యాచ్‌లో విశ్రాంతి ఇవ్వాలి. కోహ్లి, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్‌తో మిడిలార్డర్ పటిష్టంగా ఉంది. ఏడోస్థానంలో జయంత్ యాదవ్ రావాలి. అశ్విన్ జట్టులోకి రావాలి’’ అని అభిప్రాయపడ్డాడు. కాగా 2018 పర్యటనలో భాగంగా భారత్ 4-1 తేడాతో వన్డే సిరీస్ గెలిచిన సంగతి తెలిసిందే.