మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయ్ ఆగస్టు 16న కన్నుమూసిన సంగతి తెలిసిందే. అయితే ఆయన మృతి చెంది దాదాపు పది పన్నెండు రోజులు అవుతుండగా ఇప్పుడు ఆయన మృతి విషయంలో ఎన్టీయే భాగస్వామ్య పక్షమైన శివసేన పలు అనుమానాలకు తెరలేపింది. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ మరణ తేదీ గురించి శివసేన ఎంపీ ఒకరు రాసిన సంపాదకీయం ఇప్పుడు దేశంలో చర్చనీయంసం అయ్యింది. వాజ్‌పేయి ఆగస్టు 16 కు ముందు మరణించారా?, స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగానికి ఆటంకం లేకుండా ఉండటానికే ఆ విషయాన్ని ఆలస్యంగా ప్రకటించారా? అని సంపాదకీయంలో ఎంపీ సంజయ్ రౌత్ సందేహం వ్యక్తం చేశారు.
శివసేన అధికార పత్రికలో సామ్నాలో ఒక ‘స్వరాజ్యం అంటే ఏమిటి?’ అనే శీర్షికతో ప్రచురించిన సంపాదకీయంలో రాజ్యసభ ఎంపీ, సామ్నా ఎడిటర్ సంజయ్ రౌత్ తన సందేహాన్ని వ్యక్తం చేయడం ఇప్పుడు కలకలం రేపుతోంది. ‘తొలుత స్వరాజ్యం అంటే ఏంటో ప్రజలు, పాలకులు ముందు అవగాహన చేసుకోవాలి ఆగస్టు 16 న వాజ్‌పేయి మరణించారు.. కానీ ఆగస్టు 12 నుంచే ఆయన ఆరోగ్యం క్షీణిస్తూ వచ్చింది. స్వాతంత్య్ర దినోత్సవం రోజున జాతీయ సంతాపం, పతాకం అవనతాలను తప్పించేందుకే ఆగస్టు 16న వాజ్‌పేయి మరణించినట్లు ప్రకటించారా? లేక ఎర్రకోట మీదుగా సుదీర్ఘమైన మోదీ ప్రసంగానికి అడ్డంకులు లేకుండా ఉండేందుకు వాజ్‌పేయ్ మృతిని 16న ప్రకటించారా?’ అని సంజయ్ ప్రశ్నించారు. దీని మీద బీజేపీ ఇంకా ఎటువంటి ప్రకటనా చేయలేదు.