ఇదేం మేనిఫెస్టో…మందు మీద 50% డిస్కౌంట్ అట !

ఎన్నికల వేళ ఓటర్లను ఆకర్షించేందుకు రాజకీయ పార్టీలు జనాకర్షక పథకాలతో ముందుకొస్తుంటాయి. ప్రత్యర్థులతో పోటాపోటీగా ఒకరిని మించి మరొకరు ‘ఉచిత’ స్కీములను ప్రకటిస్తుంటారు. తాజాగా ఢిల్లీలోనూ సాంఝి విరాసత్ పార్టీ ప్రకటించిన మేనిఫెస్టో కలకలం రేపుతోంది. ఎందుకంటే తమ పార్టీ అధికారంలోకి వస్తే.. ప్రజలకు మద్యంపై 50% డిస్కౌంట్ ఇస్తామని ప్రకటించింది. అంతేనా.. ముస్లింలకు ఈద్ పండుగ సమయంలో ఉచితంగా మేకలు, మహిళలకు ఉచితంగా బంగారం ఇస్తామని హామీ ఇచ్చింది. సాంఝి విరాసత్ పార్టీ తరుపున ఈశాన్య ఢిల్లీ నుంచి పోటీ చేస్తున్న అమిత్ శర్మ.. తన ఎన్నికల ప్రచార పోస్టర్‌లో ఈ హామీలను ముద్రించారు.దేశంలో ఆయా రాజకీయ పార్టీలు కేజీ టూ పీజీ ఉచిత విద్య అంటుంటే సాంఝి మాత్రం పీహెచ్‌డీ వరకు ఉచిత విద్య అందిస్తామని మేనిఫెస్టోలో పొందుపరిచింది. ఢిల్లీ విద్యార్థులందరికీ ఉచిత బస్సు/మెట్రో సదుపాయం, ఉచిత రేషన్, ఆడ శిశువు జన్మిస్తే రూ.50వేలు నగదు అందజేత, ఆడబిడ్డ పెళ్లికి రూ.2,50,000, నిరుద్యోగులకు నెలకు రూ.10వేలు, వితంతువులు, వికాలంగులు, వృద్దులకు ప్రతీ నెలా రూ.5వేలు పెన్షన్, రూ.1లక్ష వరకు ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఉచిత ట్రీట్‌మెంట్ వంటి హామీలను సాంఝి విరాసత్ తమ మేనిఫెస్టోలో పెట్టింది.