బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ బయోపిక్ ‘సంజు’ చిత్రం తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈమద్య కాలంలో వచ్చిన బయోపిక్‌లు అన్ని కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంటూ వస్తున్నాయి. అందుకే ఈ చిత్రం కూడా తప్పకుండా ఆకట్టుకుంటుందని అంతా ఆశించారు. అయితే ఊహించినదానికంటే దాదాపు మూడు నాలుగు రెట్ల వసూళ్లు ఈ చిత్రానికి నమోదు అవుతున్నాయి. దర్శకుడు రాజ్‌కుమార్ హిరాని ‘సంజు’ చిత్రాన్ని అద్బుతంగా ఆవిష్కరించాడు. సంజయ్ దత్ జీవితంలోని కీలక అంశాలను తీసుకుని, దాన్ని సినిమాటిక్‌గా దర్శకుడు చూపించిన తీరు, సంజయ్ దత్ గురించి ఏ ఒక్కరికి తెలియని పలు విషయాలను సినిమాలో చూపించడంతో ఈ సంచలనం నమోదు అయ్యింది. కేవలం వారం రోజుల్లోనే దాదాపు 250 కోట్ల వసూళ్లు నమోదు అయ్యాయి.
సంజయ్ దత్ తన స్టోరీతో సినిమా తీసేందుకు రాజ్‌కుమార్ హిరానీకి అనుమతించేందుకు మొదట పది కోట్ల మేరకు తీసుకున్నాడు. అంటే తన కథను అమ్ముకున్న సంజయ్ దత్‌కు ఏకంగా పది కోట్లు ముట్టాయి. ఇక తాజాగా చిత్రం విజయం సాధించిన నేపథ్యంలో సంజయ్‌కు మరో అయిదు కోట్లను నిర్మాత ముట్టజెప్పినట్లుగా తెలుస్తోంది. మొత్తంగా సంజు వల్ల సంజయ్ దత్‌కు ఏకంగా 15 కోట్ల మేరకు దక్కిందని బాలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఒక హీరో బయోపిక్కు ఇంత భారీ రైట్స్ రావడం ఇదే ప్రథమంగా చెప్పుకోవచ్చు. ఇండియన్ స్క్రీన్‌పై వచ్చిన అతి ఖరీదైన బయోపిక్‌గా కూడా సంజు రికార్డును సాధించింది. వసూళ్లు ఇంకా ఎక్కువ వస్తే మరో అయిదు కోట్లు కూడా సంజయ్ దత్‌కు దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది. మొత్తానికి సంజయ్ దత్ అదృష్టం ఇలా కలిసి వచ్చింది.