ఇటీవల గోవాలో జరిగిన ఒక సినిమా అవార్డు ఫంక్షన్ లో కొన్ని అవాంతరాలు తలెత్తి కన్నడ నుంచి వచ్చిన నటీనటులకు అసౌకర్యం కలగడం చిన్నపాటి సంబంధానికి దారి తీసింది. దాని నిర్వాహకుడు మెగా ఫ్యామిలీకి సంబంధించిన పిఆర్ఓగా కన్నడ మీడియా వర్గాల్లో ప్రచారం జరగడంతో నిర్మాత అల్లు అరవింద్ స్వయంగా క్లారిటీ ఇచ్చారు. ఒక బ్యానర్ లాంచ్ కి అతిధిగా వచ్చిన ఆయన మాట్లాడుతూ ఒక ప్రైవేట్ జర్నలిస్ట్ ఎప్పటి నుంచో ఈ ఫంక్షన్ చేస్తున్నాడని, ఈసారి ఫెయిల్ కావడం అతని వ్యక్తిగత బాధ్యత తప్పించి మా కుటుంబానికి ఎలాంటి ప్రమేయం లేదని స్పష్టం చేశారు.
నిన్న కొందరు శాండల్ వుడ్ నటీనటులు దీని గురించి ట్వీట్లు పెట్టడంతో అక్కడి పత్రికల్లో మెగా పిఆర్ఓ చేసిన ఫంక్షన్ గా ప్రచారం చేసారు . దీనికి తోడు వేడుక నిర్వహించిన విధానం పట్ల వాళ్ళు తీవ్ర ఆగ్రహంగా ఉన్న విషయాన్ని హైలైట్ చేయడంతో క్రమంగా ఈ వివాదం పబ్లిక్ లోకి వచ్చేసింది. ఏవో బిల్లుల చెల్లింపులో జరిగిన ఆలస్యం వల్ల విద్యుత్ సరఫరా ఆగిపోవడంతో పాటు హోటల్ వ్యయం సమయానికి జమ చేయకపోవడం వల్ల రభసకు దారి తీసిందని అంటూ ఉన్నారు . సదరు వ్యక్తి గురించి పేరు కానీ, ఇంకే ఇతర వివరాలు కానీ అల్లు అరవింద్ నేరుగా ప్రస్తావించలేదు.
ఇండస్ట్రీకి సంబంధం లేని ఒక ప్రైవేట్ వేడుకని టాలీవుడ్ కి ఆపాదించడం కరెక్ట్ కాదు అనేది అరవింద్ గారి వెర్షన్. ఇందులో న్యాయముంది. ఇది మా అసోసియేషన్ లేదా ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ చేస్తున్న ఈవెంట్ కానే కాదు . పోనీ ఈఫా, ఫిలిం ఫేర్ లాంటివి అయితే వాటి వ్యవహారం ప్రొఫెషనల్ గా ఉంటుంది. అలా కాకుండా ఒక వ్యక్తి చేస్తున్నప్పుడు ఇలాంటి సమస్యలే వస్తాయి. అల్లు అరవింద్ స్వయంగా చెప్పాక ఆయన వివరణ వీడియో రూపంలో సోషల్ మీడియాలో తిరుగుతుంది . అయినా బయట రాష్ట్రాల్లో ఏదైనా ప్లాన్ చేసుకున్నప్పుడు అన్ని విషయాల్లోనూ జాగ్రత్తగా ఉండాలి.