సినిమా వాళ్లు కనపడితే అభిమానులు, మీడియా, ఫొటోగ్రాఫర్లు వారి చుట్టూ చక్కర్లు కొడుతూ ఉంటారు. అలాంటి సమయంలో కొన్నిసార‍్లు అనుకోని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. కొన్నిసార్లు సెలబ్రిటీలు వారి సహనాన్ని కోల్పోతారు. ఫ్యాన్స్ అని చూడకుండా వారిపై అరుస్తారు, తిడతారు, కొడతారు కూడా. కానీ బాలీవుడ్ ముద్దుగుమ్మ సారా అలీ ఖాన్ మాత్రం అందుకు భిన్నంగా ప్రవర్తించింది. తన మృదువు స్వభావంతో అందరినీ ఆకట్టుకుంది. ఇటీవల సోమవారం జరిగిన ఒక ఈవెంట్‌లో నెట్టివేయబడిన ఒకరి కోసం నిలబడింది సారా.
సారా అలీ ఖాన్ రాబోయే చిత్రం ‘ఆత్రంగి రే’లోని చక్ చక్ పాటను లాంచ్ చేయడానికి ముంబైలోని మిథిబాయి కాలేజ్ ఫెస్ట్ ‘క్షితిజ్’కు హాజరయింది. వేడుక అనంతరం అక్కడినుంచి వెళ్లేటప్పుడు సెక్యూరిటీ గార్డ్స్ ఎవరో ఒక ఫొటోగ్రాఫర్‌ను నెట్టివేసినట్టున్నారు. అది చూసిన సారా, కారు ఆపి ‘ఎవరిని కిందకు తోసారు’ అని సెక్యురిటీ గార్డ్స్‌ను ప్రశ్నించింది. దానికి వారు ‘ఎవరూ కింద పడలేదు’ అని సమాధానం ఇచ్చారు. దానికి ‘లేదు లేదు, మీరు నెట్టేసిన అతను అప్పటికే వెళ్లిపోయాడు.’ అని సెక్యూరిటీ గార్డ్స్‌ని తిరిగి నిలదీసింది.
అనంతరం కారు ఎక్కుతూ ఫొటోగ్రాఫర్స్‌తో ‘సారీ చెప్తున్నా, థ్యాంక్యూ’ అని చెప్పింది. అలాగే సెక్యూరిటీ గార్డ్స్‌తో ‘ఇలా ప్రవర్తించవద్దు. ఎవరినీ నెట్టవద్దు.’ అని స్వీట్‌గా వార్నింగ్ ఇచ్చింది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘ఆత్రంగి రే’ చిత్రంలోని ఎనర్జిటిక్ ఫస్ట్ సాంగ్ ‘చక్ చక్’ని విడుదల చేశారు మేకర్స్. ఉల్లాసభరితమైన ఈ పాటలో సారా నియాన్ గ్రీన్, పింక్ చీర ధరించి బీట్‌లకు అనుగుణంగా డ‍్యాన్స్ చేసి ఆకట్టుకుంది. సౌత్ ఇండియన్ స్టైల్ సెలబ్రేషన్ ఈవెంట్‌లో సెట్ చేసిన ఈ పాటలో ధనుష్ నటించాడు. ఈ చిత్రం డిసెంబర్ 24న డిస్నీ ప్లస్ హాట్‌స‍్టార్‌లో విడుదల కానుంది.