నటీ నటులు : విజయ్ , కీర్తి సురేష్, వరలక్ష్మి శరత్ కుమార్, యోగి బాబు తదితరులు
సంగీతం : ఎ.ఆర్. రెహ్మాన్
సినిమాటోగ్రఫీ : గిరీష్ గంగాధరన్
నిర్మాత : అశోక్ వల్లభనేని
దర్శకత్వం :మురుగదాస్
కోలీవుడ్‌లో టాప్ స్టార్‌గా ఉన్న ఇలయదళపతి విజయ్ తెలుగులో ఇంకా సూర్య, విశాల్ ల మార్కెట్ చేరుకోలేకపోతున్నాడు. తుపాకి, అదిరింది లాంటి సినిమాలు టాలీవుడ్లో పరవాలేదనిపించినా విజయ్ స్థాయి సక్సెస్‌లు మాత్రం సాధించలేకపోయాయి. తుపాకి, అదిరింది లాంటి సినిమాల తర్వాత తాజాగా మరోసారి మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన సర్కార్ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు విజయ్. గతంలో వీరి కాంబినేషన్లో వచ్చిన తుపాకి, కత్తి సినిమాలు ఘనవిజయం సాధించటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఆ అంచనాలను సర్కార్ అందుకుందా..? మహేష్ స్పైడర్ దెబ్బకు తెలుగు వాళ్ళని భయపెటిన మురుగదాస్ ఈసారయినా మెప్పిస్తాడా అనేది సమీక్షలో తెలుసుకోవాల్సిందేక
కధ :
సుందర్ రామస్వామి (విజయ్) సంవత్సరానికి వేల కోట్లు సంపాదించే బిజినెస్‌మేన్. తను ఏ దేశంలో అడుగుపెట్టిన అక్కడి కంపెనీలను దెబ్బతీసి, వాటిని మూసేయించే ఒక కార్పోరేట్ క్రిమినల్ మైండెడ్ వ్యక్తి. అలాంటి సుందర్ భారత్‌కు వస్తుండన్నా సమాచారంతో ఇక్కడి కార్పోరేట్ కంపెనీలన్ని ఉలిక్కి పడతాయి. కానీ ఇండియా వచ్చిన సుందర్ కేవలం తన ఓటు హక్కును వినియోగించుకోవడానికే వచ్చానని చెప్పటంతో అంతా ఊపిరి పీల్చుకుంటారు. ఓటు వేయడానికి వెళ్లిన సుందర్‌కు తన ఓటును ఎవరో దొంగ ఓటు వేశారని తెలుస్తుంది. దీంతో తన ఓటు కోసం కోర్టును ఆశ్రయిస్తాడు.
సుందర్ ఓటు హక్కు వినియోగించుకునే వరకు అక్కడ ఎలక్షన్ కౌంటింగ్ ఆగిపోతుంది. సుందర్ విషయం తెలిసి ఓటు వేయలేకపోయిన దాదాపు 3 లక్షల మందికిపైగా ప్రజులు అదే తరహాలో కేసుల వేస్తారు.దీని కారణంగా ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం మధ్యలోనే ఆగిపోతుంది. ఎన్నికలను మళ్లీ నిర్వహించాలని ఎన్నికల సంఘం ఆదేశిస్తుంది. ఇంతకీ కోర్టు ఇచ్చిన తీర్పు ఏమిటి? ఆ తీర్పు వల్ల రాష్ట్ర రాజకీయం ఎలాంటి మలుపు తిరిగింది? సుందర్ రామస్వామి రాజకీయాల్లోకి వచ్చాడా? వస్తే ముఖ్యమంత్రి అయ్యాడా? అనేదే సినిమా.
విశ్లేషణ :
ఎన్నికల నిబంధనలలోని సెక్షన్ 49Pని ఆధారంగా చేసుకుని దర్శకుడు ఎ.ఆర్.మురుగదాస్ రాసుకున్న కధే ఈ సినిమా. వాస్తవానికి ఈ సెక్షన్ గురించి చాలా మందికి అవగాహన ఉండదు ఓ వ్యక్తి ఓటును వేరెవరో దొంగ ఓటు వేస్తే.. ఈ మూలంగా ఓటు కోల్పోయిన వ్యక్తి తగిన ఆధారాలతో ఎన్నికల అధికారిని కలిసినప్పుడు బ్యాలెట్ ఓటుకు అనుమతించాలి. ఇదే సెక్షన్ 49P. దీని చుట్టూనే ‘సర్కార్’ కథ అల్లుకుంది. కథను చాలా బాగా రాసుకున్న మురుగుదాస్ అదంతా స్క్రీన్ ప్లేలో చూపించలేకపోయారు. కేవలం విజయ్ మీదే ఆయన దృష్టి పెట్టినట్టు స్పష్టంగా తెలుస్తోంది.
హీరో ఇమేజ్‌ని బాలెన్స్ చేసుకుంటూ ఇలాంటి కథల్ని ఎందుకోవడం సులభమైన విషయం కాదు. అయితే హీరో ఇమేజ్‌ని కాపాడే ప్రయత్నంలో దర్శకుడు చాలా లాజిక్ లేని నిర్ణయాలు తీసేసుకున్నాడు. ఓ దశలో.. మురుగదాస్ కథని సైతం హీరో ఇమేజ్ డామినేట్ చేస్తుంటుంది. సాధారణంగా మురుగదాస్ సినిమాల్లో గొప్ప స్క్రీన్ ప్లే టెక్నిక్ కనిపిస్తుంటుంది. అది ఈ సినిమాలో మిస్సయిందని నా వ్యక్తిగత అభిప్రాయం. ఫస్టాఫ్‌లో సుందర్ పరిచయం, ఆయన ఇండియాకు రావడం, దొంగ ఓటుపై ఆయన చేపట్టిన ఉద్యమాన్ని చూపించిన దర్శకుడు..
సెకండాఫ్‌లో రాజకీయ ప్రత్యర్థుల్ని ఎదుర్కోవడాన్ని చూపించారు. గత చిత్రాలతో పోలిస్తే ఈ సినిమాలో విజయ్ లుక్, నటన కొత్తగా అనిపిస్తాయి. తన సినిమాల్లో ధూమపానం లేకుండా చూసుకునే మురుగదాస్ ‘సర్కార్’లో మాత్రం విజయ్‌తో సిగరెట్ వెలిగించారు. ఎక్కడా అనవసరపు సన్నివేశాలు లేకుండా ఫస్టాఫ్‌లోనే సినిమాను దర్శకుడు మెయిన్ ట్రాక్ ఎక్కించారు. కానీ ఫస్టాఫ్‌లో ఎక్కడా గొప్పగా చెప్పుకునే సన్నివేశాలు లేవు. సెకండాఫ్‌లో వరలక్ష్మీ శరత్‌కుమార్ ఎత్తులు, విజయ్ పైఎత్తులు కాసేపు ఆసక్తిని రేపుతాయి. కానీ క్లైమాక్స్ చప్పగా అనిపిస్తుంది. అయితే రామ్-లక్ష్మణ్ యాక్షన్ సన్నివేశాలను మాత్రం ప్రేక్షకుడు బాగా ఎంజాయ్ చేస్తాడు. ఫైట్లు చాలా బాగా కంపోజ్ చేశారు. కానీ సమయం సందర్భం లేకుండా వచ్చే పాటలు మాత్రం విసుగు పుట్టిస్తాయి. సినిమాకు పాటలు పెద్ద మైనస్ అనే చెప్పొచ్చు.
ఎవరెలా చేశారంటే :
విజయ్ తన అభిమానుల్ని సంతృప్తి పరచడానికి అన్నివిధాలా కష్టపడ్డాడు. నెరిసిన గడ్డంతో విజయ్ లుక్ చాలా కొత్తగా ఉంది. అంతేకాదు మేనరిజంలోనూ విజయ్ కొత్తదనాన్ని చూపించారు. కీర్తి సురేష్ పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేదు. సినిమా మొత్తం విజయ్ పక్కనే కనిపించినా కదలని బొమ్మలా ఉండిపోయింది. వరలక్ష్మీ శరత్‌కుమార్ కాసేపే కనిపించినా ఆకట్టుకుంది. ముఖ్యంగా ఆమెకు డబ్బింగ్ బాగా కుదిరింది. సీనియర్ రాజకీయ నాయకుడిగా రాధారవి నటన ఆకట్టుకుంటుంది. తులసి, యోగి బాబు తప్ప మిగిలిన మొహాలన్నీ తెలుగు ప్రేక్షకులు దాదాపుగా తెలియకపోవచ్చు.
తెలుగు బుల్లెట్ పంచ్ లైన్ : స్ట్రాంగ్ మెసేజ్…వీక్ స్క్రీన్ ప్లే
తెలుగు బులెట్ రేటింగ్ : 2.5/5