విప్లవ నాయకురాలు జయలలిత మరణం చుట్టూ ముసురుకున్న సందేహాలు ఇంకా వీడలేదు. ఆ గుట్టు విప్పేందుకు ఏర్పాటైన కమిషన్ ఇప్పటిదాకా పెద్ద సంఖ్యలో విచారణ జరిపింది. అయితే అసలు గుట్టు మాత్రం అలాగే వుంది. అయితే ఈ విచారణ పర్వంలో కమిషన్ ఓ ముఖ్య అంశాన్ని గుర్తించింది. జయ మరణానికి సంబంధించి శశికళ సన్నిహితులు, ఇతరులు ఇస్తున్న వాంగ్మూలం మధ్య తేడా స్పష్టంగా కనిపిస్తోంది. ఆ తేడా ఎందుకు వస్తోంది ? ఇంకా ఏమైనా రహస్యాలు బయటకు రాకుండా ఉండిపోయాయా అన్న డౌట్ కమిషన్ కి ఏర్పడింది. ఆ చిక్కుముడి వీడాలంటే ప్రస్తుతం బెంగుళూరు పరప్పన అగ్రహార జైల్లో శిక్ష అనుభవిస్తున్న శశికళని విచారించాలని కమిషన్ భావిస్తోంది.
రిటైర్డ్ న్యాయమూర్తి ఆర్ముగస్వామి నాయకత్వంలో కిందటి ఏడాది సెప్టెంబర్ లో జయ మరణం మీద కమిషన్ విచారణ చేపట్టింది. ఈ ఏడాది అక్టోబర్ 24 తో కమిషన్ గడువు పూర్తి కానుంది. ఈలోపే శశికళ ని విచారించడానికి కమిషన్ ఏర్పాట్లు చేసుకుంటోంది. గతంలో కమిషన్ ముందు వాంగ్మూలం ఇవ్వకుండా తప్పించుకోడానికి శశికళ ఎన్నో సాకులు చెప్పారు. అయితే ఈసారి పకడ్బందీగా ఆ పని పూర్తి చేయాలని ఆర్ముగాస్వామి కమిషన్ భావిస్తోంది. ప్రస్తుతం జైలు నుంచి విచారణ కోసం శశికళ ని బయటకు తీసుకురావాలంటే ఎన్నో అనుమతులు కావాలి. దానికన్నా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆమెని విచారించడం మేలు అని కమిషన్ అనుకుంటోంది. ఇందు కోసం తగిన ఏర్పాట్లు కూడా చేసుకుంటోంది.